బెంగుళూరు: భారత్ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం అంత ఈజీ కాదు. అతని ప్రతి కదలికపై నిఘా ఉంటుంది. నిజం చెప్పాలంటే టీమిండియా కెప్టెన్‌గా ఉండటం అంటే తలపై ముళ్ల కిరీటం ధరించినట్లే. ఒత్తిడి లేకుండా ఎన్నడూ ఆడటం అసాధ్యం. ఇటీవల కాలంలో టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ ధోనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అయితే ఆ విమర్శలకు కెప్టెన్ ధోని బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఆసియా కప్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోని తన విశ్వరూపాన్ని చాటాడు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్లతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో కేవలం ఆరు బంతులాడిన కెప్టెన్ ధోనీ ఒక ఫోర్, 2 సిక్సర్లతో 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆసియా కప్ టైటిల్‌ని భారత్‌కు అందించేందుకు ధోని అద్భుతమైన సిక్స్‌తో మ్యాచ్‌ని ముగించాడు. ఈ సిక్స్‌తో ధోనీ స్ట్రయిక్ రేట్ 333.3గా నమోదైంది. అంతేకాదు టీ20 ఫార్మెట్‌లో మహేంద్ర సింగ్ ధోని అత్యధిక స్ట్రయిక్ రేట్ కావడం విశేషం.

34 ఏళ్ల ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో తనపై వచ్చిన విమర్శలకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్తూ వస్తున్నాడు. మ్యాచ్ విజయం అనంతరం ధోని మాట్లాడుతూ టాప్ ఆర్డర్ చాలా వరకు బాగా ఆడిందన్నారు. లోయర్ ఆర్డర్ అవసరానికి తగినట్లు ఆడిందని చెప్పుకొచ్చిన ధోని ఇప్పుడు జట్టు బాగుందన్నారు.
ప్రపంచకప్‌కు సిద్ధంగా ఉన్నామని, బుమ్రా బౌలింగ్‌లో అందమేంటంటే.. అతడు యార్కర్లు బాగా వేయగలడని కొనియాడారు. భిన్నమైన బౌలింగ్ శైలి కూడా అందుకు ఉపయోగపడుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువరాజ్‌కు నాలుగో స్థానం ఇవ్వడం కష్టమని, కానీ అతడు సర్దుకున్నాడని ధోని అన్నాడు. జట్టులో 13 నుంచి 14 మంది మ్యాచ్ విన్నర్లున్నారని, అదే మా జట్టు గొప్పతనమని ధోని చెప్పాడు.