
హైదరాబాద్: కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో రాణించడంతో ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. టోర్నీలో భాగంగా సోమవారం భారత్-థాయ్‌లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు మెష్రమ్ (32), స్మృతి మందాన (29) చక్కటి శుభారంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు.

చివర్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 17 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్ ఆ మాత్రం స్కోరు నమోదు చేయగలిగింది. అనంతరం 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 66 పరుగులు మాత్రమే చేయగలిగింది. హర్మన్ ప్రీత్ మూడో ఓవర్లు వేసి 11 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసింది.
ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో మలేషియాను కేవలం 27 పరుగులకే ఆలౌట్ చేసి 142 పరుగులతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టోర్నీలో మూడో మ్యాచ్‌ను బుధవారం బంగ్లాదేశ్‌తో ఆడుతుంది.