మిర్పూర్: ఆసియా కప్ ట్వంటీ20 పోటీల్లో భారత క్రికెట్ జట్టు వరుస విజయాలను నమోదు చేసుకుంది . టోర్నీలో టీమిండియా వరుసగా నాలుగో విజయం సాధించింది.షేర్‌బంగ్లా నేషనల్ స్టేడియం వేదిక గురువారం జరిగిన మ్యాచలో భారత 9 వికెట్ల తేడాతో పసికూన యూఏఈపై అలవోకగా గెలిచింది.
భారత బౌలర్ల ధాటికి యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 81 పరుగులు మాత్రమే చేయగలిగింది. షైమన్ అన్వర్ (43) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.. భువనేశ్వర్ (2/8), హార్దిక్ పాండ్యా (1/11), యువరాజ్ సింగ్ (1/10), బుమ్రా (1/23), భజ్జీ (1/11) ప్రత్యర్థిని కట్టడి చేశారు.

ఆ తర్వాత అతి స్వల్ప లక్ష్యాన్ని భారత ఒక వికెట్ కోల్పోయి మరో 59 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్ రోహిత శర్మ (39)తో పాటు శిఖర్ ధవన (16 నాటౌట్), యువరాజ్ సింగ్ (25 నాటౌట్) రాణించారు. చివరి పది టీ20ల్లో ధోనీసేనకిది తొమ్మిదో విజయం కావడం విశేషం. రోహిత్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. ఇక ఆదివారం టైటిల్ పోరులో బంగ్లాదేశతో భారత తలపడనుంది.
స్వల్ప లక్ష్య ఛేదన భారతకు నల్లేరుపై నడకే అయింది. తొలి మూడు ఓవర్లలో యూఏఈ పేసర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో ఓపెనర్లు రోహిత్, ధావన్ ఆచితూచి ఆడారు. జావెద్ వేసిన 4వ ఓవర్‌లో రోహిత్ 4, 6, 4తో హిట్టింగ్ మొదలు పెట్టాడు. తర్వాతి ఓవర్‌లోనూ అతను రెండు బౌండ్రీలతో జోరు ప్రదర్శించాడు. ఆ తర్వాత మరో రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ అదే ఊపులో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యాడు.
రోహిత్ వెనుదిరిగిన తర్వాత ధావన్‌తో యువరాజ్ జతకలిశాడు. యువరాజ్ సింగ్ ఎదుర్కొన్న రెండో బంతినే బౌండ్రీ తరలించి ఆత్మవిశ్వాసం కూడదీసుకున్నాడు. అహ్మద్ బౌలింగ్‌లో ధవన కూడా రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చాడు. తర్వాత యువరాజ్ 4, 6, 4తో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇక షెహజాద్ వేసిన 11వ ఓవర్‌లో యువీ బౌండ్రీతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈని భారత బౌలర్లు బెంబేలెత్తించారు. నెహ్రా, అశ్విన్, జడేజా స్థానాల్లో జట్టులోకొచ్చిన భువనేశ్వర్, హర్భజన్, పవన్ నేగి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆరంభంలోనే ఓపెనర్ స్వప్నిల్‌ను భువీ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు.
తర్వాత షెహజాద్‌ను బుమ్రా డకౌట్ చేశాడు. ముస్తాఫా, ఉస్మాన కూడా స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు. యూఏఈ 53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో షైమన అన్వర్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కున్నాడు.