దుబాయిలో బంగ్లాతో మ్యచ్: ఫేవరేట్‌గా టీమిండియా, లైనప్‌లో ధోని ముందుకు

హైదరాబాద్: చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో జోష్‌లో ఉన్న టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆసియా కప్ సూపర్ ఫోర్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో శుక్రవారంతో అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీ రికార్డు, ఆటగాళ్ల పరంగా చూస్తే ఈ మ్యాచ్‌లో రోహిత్‌సేన ఫేవరెట్. కానీ సంచలనాలకు మారుపేరైన బంగ్లాదేశ్‌తో మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.
బంగ్లాదేశ్‌కు పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. గురువారం అబుదాబిలో అప్ఘన్‌తో మ్యాచ్ ఆడిన బంగ్లా.. ఈ మ్యాచ్ కోసం దుబాయికి ప్రయాణం చేయాల్సి ఉంది. కాబట్టి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆడటం వల్ల బంగ్లాదేశ్ ఆటగాళ్లు అలసిపోయే ప్రమాదం ఉంది. అయితే గాయాల బెడద టీమిండియాను ఆందోళనపరుస్తోంది.
తీవ్రమైన వెన్ను నొప్పితో పాక్‌తో మ్యాచ్ నుంచి అర్దంతరంగా వైదొలగిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీనికి తోడు స్పిన్నర్ అక్షర్ పటేల్, పేసర్ శార్దూల్ ఠాకూర్ కూడా గాయాల సమస్యతో టోర్నీనుంచి నిష్క్రమించారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేసిన లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్‌కు ఎడమ చూపుడు వేలికి గాయమైంది.

భువనేశ్వర్‌కు విశ్రాంతి
అతడి వేలు చిట్లినట్టు స్కానింగ్‌లో తేలింది. శార్దూల్ తొడ కండర గాయంతో బాధపడుతున్నాడు. దీంతో ఈ ముగ్గురి స్థానాల్లో దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, సిద్ధార్థ్ కౌల్‌ను బీసీసీఐ గురువారమే దుబాయ్‌కు పంపించింది. అయితే ఈ త్రయంలో ఎవరు తుది జట్టులో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో విఫలమైన బౌలర్లు.. పాక్‌పై మాత్రం చెలరేగిపోయారు. అయితే వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడటంతో.. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న భువనేశ్వర్‌కు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇదే జరిగితే బుమ్రాకు తోడుగా ఖలీల్ అహ్మద్ తుది జట్టులోకి రావొచ్చు.

హార్దిక్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో!
హార్దిక్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. అక్షర్‌కు బదులు రవీంద్ర జడేజా, శార్దూల్ స్థానంలో సిద్దార్థ కౌల్ జట్టులో చేరనున్నారు. బౌలింగ్ ఆల్‌రౌండర్ కాకుండా మిడిలార్డర్‌ను బలోపేతం చేయాలని భావిస్తే మాత్రం మనీష్ పాండేను తీసుకోవచ్చు. ఎలాగూ పాండ్యా బౌలింగ్ లోటును కేదార్ జాదవ్ తీరుస్తున్నాడు కాబట్టి బ్యాటింగ్ లోతుపైనే రోహిత్ ఎక్కువగా దృష్టిపెట్టే అవకాశం ఉంది. ఓపెనర్లు రోహిత్, ధవన్ గాడిలో పడటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అయితే దోనీ వైఫల్యం జట్టు యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది. లైనప్‌లో ముందుకు తీసుకొచ్చి ధోనికి కుదురుకునే అవకాశం ఇస్తే మాత్రం మ్యాచ్ పరిస్థితే మారిపోతుంది.

బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు
ఈ దిశగా రోహిత్ యోచిస్తున్నా.. మేనేజ్‌మెంట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. సూపర్ ఫోర్‌లో ఆదివారంనాడు పాకిస్థాన్‌తో భారత్ మరోసారి అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంది. దాంతో విజయాల పరంపరను కొనసాగించడం ద్వారా ఆ మ్యాచ్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని రోహిత్ సేన భావిస్తోంది. పాక్‌పై మరో చిరస్మరణీయ విజయం సాధించిన ఉత్సాహంలో భారత్ ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయడానికి ఏమాత్రం వీల్లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నాణ్యమైన జట్టు స్థాయికి బంగ్లా ఎదిగింది.

2012 ఆసియా కప్ ఫైనల్‌కు చేరిన బంగ్లాదేశ్
2012లో స్వదేశంలో జరిగిన ఆసియా కప్‌లో ఆ జట్టు ఫైనల్‌కు చేరింది. ప్రస్తుత టోర్నీలో శ్రీలంకలాంటి జట్టును ఓడించింది. బ్యాటింగ్‌తో పోలిస్తే.. బంగ్లా బౌలింగే బలంగా కనిపిస్తున్నది. నాణ్యమైన పేసర్లు ముస్తాఫిజుర్, రూబెల్ హుస్సేన్ మంచి ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. వీళ్లకు తోడుగా అనుభవజ్ఞులు మోర్తజా, షకీబ్ అండగా నిలుస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్ తనదైన రోజున ఎలాంటి జట్టుకైనా షాక్ ఇవ్వగలదు. మధ్య ఓవర్లలో వీళ్ల బౌలింగ్‌ను ఎదుర్కొని భారత మిడిలార్డర్ పరుగులు చేయాలంటే కాస్త శ్రమించాల్సిందే.
ఆసక్తికరంగా భారత్-బంగ్లా మ్యాచ్
ఇక, బ్యాటింగ్‌లో ముష్ఫికర్, తమీమ్, షకీబ్, మహ్మదుల్లా, లిట్టన్ దాస్, మోమినల్ హక్‌పై ఎక్కువగా భారం పడనుంది. తొలి మ్యాచ్‌లో సెంచరీతో ముష్ఫికర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారంనాటి మ్యాచ్ ఆసక్తికరంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు అబుదాబిలో జరిగే మరో సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్థాన్- అప్ఘానిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

జట్లు(అంచనా):
టీమిండియా: రోహిత్ (కెప్టెన్), ధవన్, రాయుడు, కార్తీక్, ధోనీ, జాదవ్, చాహర్ / రాహుల్ / పాండే, భువనేశ్వర్ / ఖలీల్, కుల్దీప్, చాహల్, బుమ్రా.
బంగ్లాదేశ్: మోర్తజా (కెప్టెన్), తమీమ్, లిట్టన్ దాస్, ముష్ఫికర్, మిథున్, మహ్మదుల్లా, మొసాద్దెక్, మెహిది హసన్, రూబెల్, ముస్తాఫిజుర్.
ఇండియా Vs బంగ్లాదేశ్: Match starts at 5:00pm IST
స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
hotstar.comలో లైవ్ స్ట్రీమింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications