ఆసియా కప్ 2025లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రస్తుత టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా గ్రూప్ దశలో అప్రతిహతంగా విజయాలను సాధించింది. సూపర్-4 రౌండ్‌లోనూ బలమైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లను వరుసగా ఓడించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు బలంగా కనిపిస్తున్నా.. భారత జట్టును ఓ భయం వెంటాడుతోంది. అదే.. దారుణమైన ఫీల్డింగ్ వైఫల్యం. టీమిండియా వరుసగా 2 సూపర్-4 మ్యాచ్‌లలో చేసిన ఈ పెద్ద పొరపాటే ఫైనల్లో టైటిల్‌ను దూరం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
సూపర్-4లో 10 క్యాచ్‌లు డ్రాప్
పాకిస్తాన్‌పై దారుణ ప్రదర్శన
పాకిస్తాన్ జట్టుతో జరిగిన కీలకమైన సూపర్-4 మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు చూపించిన ప్రదర్శన ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. జట్టు ఏకంగా 5 క్యాచ్‌లు వదిలేసింది. అంతే కాకుండా ఓ సులవైన రనౌట్ అవకాశాన్ని కూడా కోల్పోయింది. అంటే 6 వికెట్లు తీసే అవకాశాలను వదులుకోవడం ప్రపంచ స్థాయి జట్టుగా పేరున్న భారత్ కు తగని విషయం. ఈ వైఫల్యం జట్టుపై తీవ్ర ఒత్తిడిని పెంచింది.

బంగ్లాదేశ్‌పై మరింత నిరాశ
పాకిస్థాన్‌పై చేసింది ఒక్క మ్యాచ్ పొరపాటు అనుకుంటే.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఫీల్డింగ్‌లో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ఆ మ్యాచ్‌లోనూ భారత ఆటగాళ్లు 5 క్యాచ్‌లు వదిలేశారు. ఇందులో అత్యంత విచిత్రమైన అంశం ఏమిటంటే, ఈ 5 క్యాచ్‌లలో ఏకంగా నాలుగు క్యాచ్‌లు కేవలం ఒకే బ్యాట్స్‌మెన్ సైఫ్ హసన్ ఇచ్చినవే.
సైఫ్ హసన్‌కు 'లైఫ్ లైన్లు'
సైఫ్ హసన్‌కు వరుసగా లభించిన లైఫ్ లైన్స్ బంగ్లాదేశ్‌కు మంచి స్కోరు అందించడంలో కీలకమయ్యాయి.
*40 పరుగుల వద్ద అక్షర్ పటేల్ క్యాచ్ వదిలేశాడు.
*65 పరుగుల వద్ద శివమ్ దూబే సులువైన క్యాచ్‌ను జారవిడిచాడు.
*66 పరుగుల వద్ద వికెట్ కీపర్ సంజు శాంసన్ మరొక లైఫ్ లైన్ ఇచ్చాడు.
*ఆ తర్వాతి ఓవర్‌లోనే 67 పరుగుల వద్ద అభిషేక్ శర్మ కూడా క్యాచ్‌ను డ్రాప్ చేశాడు.
*చివరి ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ కూడా నసుమ్ అహ్మద్ క్యాచ్‌ను వదిలేశాడు. ఈ విధంగా క్యాచ్‌లు వదిలేసినప్పటికీ అదృష్టవశాత్తు టీమిండియా ఆ మ్యాచ్‌లో విజయం సాధించగలిగింది.
ఫైనల్లో పొంచి ఉన్న ప్రమాదం
"క్యాచెస్ విన్ మ్యాచెస్" (క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి) అనే సూత్రం క్రికెట్‌లో అందరికీ తెలిసిందే. సూపర్-4 మ్యాచ్‌లలో తక్కువ బలమైన జట్లపై ఈ పొరపాట్లు చేసినా విజయం సాధించినప్పటికీ, ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లలో ఇలాంటి చిన్న పొరపాటు కూడా జట్టుకు భారీ నష్టాన్ని, టైటిల్‌ను కోల్పోయే ప్రమాదాన్ని కలిగించవచ్చు.ప్రపంచ స్థాయి జట్టుగా ఉన్న టీమిండియా ఫైనల్‌కు ముందు తమ ఫీల్డింగ్ లోపాలను తక్షణమే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే, అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ చేరినా.. కప్పు గెలిచే అవకాశం చేజారే ప్రమాదం ఉంది. ఫైనల్‌లో టీమిండియా తమ ఫీల్డింగ్‌ను పటిష్టం చేసుకొని టైటిల్‌ను గెలుచుకుంటుందో లేదో వేచి చూడాలి.