India vs Pakistan: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఆసియా కప్ 2025 ఫైనల్‌కు ముందు భారత క్రికెట్ జట్టు మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయం ప్రకారం.. ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ట్రోఫీతో కలిసి ఫోటోషూట్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే తాజా మీడియా నివేదికల ప్రకారం.. పాకిస్తాన్‌తో ఫోటోషూట్‌లో పాల్గొనడానికి తమకు ఆసక్తి లేదని భారత జట్టు సమాచారం అందించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే టీమిండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కరచాలనం చేయకపోవడంపై ఇప్పటికే వివాదం
టీమిండియా ఇలా అధికారిక కార్యక్రమాన్ని బహిష్కరించడం ఇది మొదటిసారి కాదు. అంతకు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో చేయి కలపడానికి నిరాకరించారు. షేక్ హ్యాండ్ చేయడానికి నిరాకరించిన తర్వాత పెద్ద వివాదం చెలరేగింది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది. మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను పదవి నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేసింది. అయితే ఐసీసీ పాక్ డిమాండ్లను తిరస్కరించింది.

రౌఫ్‌పై చర్యలు.. సూర్యకు జరిమానా
సెప్టెంబర్ 21న జరిగిన సూపర్-4 మ్యాచ్ సందర్భంగా కూడా మరో వివాదం రాజుకుంది. పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ అభ్యంతరకరమైన సైగలు చేయగా.. సాహిబ్జాదా ఫర్హాన్ గన్ తో కాల్చినట్లుగా సైగ చేశాడు. ఈ చర్యలకు గానూ రౌఫ్‌పై 30 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించగా.. ఫర్హాన్‌కు మందలింపు పడింది. మరోవైపు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు తమ విజయాన్ని అంకితం చేయడంతో, పాకిస్తాన్ ఫిర్యాదు మేరకు సూర్యకుమార్‌పై కూడా జరిమానా విధించారు. ఈ జరిమానాలపై బీసీసీఐ (BCCI), పీసీబీ (PCB) రెండూ అప్పీల్ చేయాలని నిర్ణయించుకున్నాయి.
ఇరు జట్ల మధ్య ఉద్రిక్తతలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఈ రోజు (ఆదివారం) జరిగే ఫైనల్‌లో ఏం జరుగుతుందో చూడాలి. ఫోటోషూట్ సంప్రదాయాన్ని విస్మరించడంపై కూడా పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.