

న్యూ ఢిల్లీ: ఆసియా కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. శుక్రవారం దుబాయి వేదికగా ఆడిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విధించిన 223 పరుగుల లక్ష్యచేధన కోసం బరిలోకి దిగిన బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనయ్యారు. ఓపెనర్లలో ఒకడైన శిఖర్ ధావన్ 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన అంబటి రాయుడు కూడా రెండు పరుగులకే ఔటయ్యాడు.
దీంతో ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే బాధ్యతను భుజాన వేసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ... నిలకడగా ఆడాడు. అయితే 48 పరుగుల దగ్గర రుబెల్ హుస్సేన్ బౌలింగ్ లో రోహిత్ ఔటయ్యాడు. దీంతో వంద పరుగుల లోపే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. చేధించాల్సిన లక్ష్యం పెద్దగా లేకపోయినా... బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో పరుగుల కోసం టీమిండియా బ్యాట్స్‌మెన్ తీవ్రంగా శ్రమించారు.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఆటగాళ్లు.. 48.3 ఓవర్లు పూర్తయ్యేసరికి పది వికెట్లు కోల్పోయి 222 పరుగులు పూర్తి చేసింది. ఓపెనర్ లిటన్ దాస్(121) 117 బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సర్లు) సెంచరీతో మెరుపులు మెరిపించడంతో 48.3 ఓవర్లలో బంగ్లా 222 పరుగులు మాత్రమే చేసింది.
బంగ్లాదేశ్ చేసిన స్కోరులో లిటన్‌దాస్ ఒంటరిపోరాటంతో దాదాపు సగం స్కోరు చేయగలిగాడు. మరో ఓపెనర్ మెహిదీ హసన్(32), సౌమ్య సర్కార్(33) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. అనవసరపు షాట్లు ఆడటం.. పరిస్థితులకు తగ్గట్లుగా నిలకడగా బ్యాటింగ్ చేయడంలో విఫలమవడంతో సులువుగా వికెట్లు చేజార్చుకున్నారు. వారిలో కొందరైతే కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.