Asia Cup 2025: ఆసియా కప్ 2025లో లీగ్ దశ ముగింపుకు చేరుకోవడంతో గ్రూప్-బీలోని మూడు జట్ల మధ్య సూపర్-4 క్వాలిఫికేషన్ కోసం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్థాన్ ఇప్పటికే తమ స్థానాలను పదిలం చేసుకున్నాయి. గ్రూప్-బీలో మాత్రం సూపర్-4 క్వాలిఫికేషన్ జట్ల గురించి ఇంకా స్పష్టత రాలేదు. బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ఈ రేసులో ప్రతి బంతి, ప్రతి పరుగు ఎంతో కీలకమైనది. నేడు శ్రీలంక, అఫ్గానిస్తాన్ మధ్య జరుగునున్న మ్యాచ్‌తో గ్రూప్-బీలో అర్హత సాధించే జట్ల భవితవ్యం నిర్ణయం కానుంది. గ్రూప్-బీలో మూడు జట్లలో ఒక్కొక్కరికి వారి అర్హత అవకాశాలు వేర్వేరుగా ఉన్నాయి.
బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ తమ అన్ని లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేసింది. ఇప్పుడు వారి భవితవ్యం శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య నేడు జరగబోయే మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. బంగ్లాదేశ్ తన లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తి చేసుకుని తమ భవితవ్యం కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడుతోంది. శ్రీలంక గనుక అఫ్గానిస్తాన్‌ను ఓడిస్తే బంగ్లాదేశ్ సూపర్-4లోకి వెళ్తుంది. కానీ అఫ్గానిస్తాన్ గెలిస్తే బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అందుకే బంగ్లాదేశ్ అభిమానులు శ్రీలంక విజయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అఫ్గానిస్తాన్ గనుక శ్రీలంకను 70 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడిస్తే, బంగ్లాదేశ్ నెట్ రన్ రేట్ శ్రీలంక కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ పరిస్థితిలో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ రెండూ క్వాలిఫై అవుతాయి.

అఫ్గానిస్తాన్
అఫ్గానిస్తాన్ క్వాలిఫికేషన్ సమీకరణం చాలా సులభంగా ఉంది. కానీ వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అఫ్గానిస్తాన్ శ్రీలంకను ఏ తేడాతో ఓడించినా, వారి నెట్ రన్ రేట్ బంగ్లాదేశ్ కంటే మెరుగ్గా ఉన్నందున శ్రీలంకతో కలిసి సూపర్-4లో అడుగుపెడుతుంది 70 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలిచినా, లేదా లక్ష్యాన్ని 50 లేదా అంతకంటే ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే ఛేదించినా, అఫ్గానిస్తాన్ బంగ్లాదేశ్‌తో కలిసి అర్హత సాధిస్తుంది.
శ్రీలంక
ఈ టోర్నీలో శ్రీలంక ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వారి క్వాలిఫికేషన్ అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ, వారు జాగ్రత్తగా ఉండాలి. శ్రీలంక అఫ్గానిస్తాన్‌ను ఏ తేడాతో ఓడించినా, వారు గ్రూప్ టాపర్‌గా నిలిచి బంగ్లాదేశ్‌తో కలిసి సూపర్-4కు వెళ్తారు. ఒకవేళ శ్రీలంక ఓడిపోయినా, ఓటమి తేడా 70 పరుగుల కంటే తక్కువగా ఉండాలి. అలా జరిగితే, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది, శ్రీలంక, అఫ్గానిస్తాన్ క్వాలిఫై అవుతాయి.అఫ్గానిస్తాన్ లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు, శ్రీలంక వారు 12.2 ఓవర్లలోపు (అంటే 46 బంతులు మిగిలి ఉండగానే) లక్ష్యాన్ని పూర్తి చేయకుండా జాగ్రత్త పడాలి. అలా జరిగితే శ్రీలంక నెట్ రన్ రేట్ దెబ్బతిని క్వాలిఫికేషన్ కష్టం అవుతుంది.