Asia Cup 2025: ఆసియా కప్ 2025 మొదలవ్వగానే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్ చేసిన ఓ పనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సంఘటన సెప్టెంబర్ 14న జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ఉద్రిక్తతను మరింత పెంచింది.
వివాదానికి కారణం ఏంటంటే?
ఆసియా కప్ తొలి మ్యాచ్‌కు ముందు పాల్గొన్న 8 జట్ల కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీతో చేతులు కలిపిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఒక అభిమాని (మేజర్ పవన్ కుమార్) సూర్యకుమార్, మొహ్సిన్ నఖ్వీతో చేతులు కలిపిన ఫోటోను షేర్ చేస్తూ, "మన క్రికెటర్ల అసలు నైజం ఇది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ రోజు మన ఇద్దరు ధైర్యవంతులను చంపారు. కానీ టీమిండియా కెప్టెన్ మాత్రం భారతదేశంపై అణు దాడి చేయాలని కోరుకున్న పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీని కలుసుకున్నప్పుడు నవ్వుతూ కనిపించాడు. ఇది క్రీడా దౌత్యం అయితే, అది చార్లీ దౌత్యం లాంటిదే" అని ఘాటుగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు సూర్యకుమార్‌పై అభిమానుల ఆగ్రహానికి అద్దం పడుతున్నాయి.
అభిమానుల ఆగ్రహానికి కారణాలివే..
ఈ వివాదం అంతటికీ ప్రధాన కారణం ఇటీవల కాలంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య రాజకీయ, సైనిక సంబంధాలు మరింత దిగజారడమే. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. సైనికుల మరణాలు భారత ప్రజల మనసులలో తీవ్ర బాధను కలిగించాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో ఎలాంటి క్రీడా సంబంధాలు పెట్టుకోవద్దని భారత ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. అయితే బీసీసీఐ మాత్రం భారత్-పాక్ మ్యాచ్‌కి పచ్చ జెండా ఊపడంతో ఇప్పటికే చాలా మంది అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.
ఈ సున్నిత పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రత్యర్థి జట్టు బోర్డు అధ్యక్షుడితో చేతులు కలపడం అభిమానులకు మరింత కోపం తెప్పించింది. చాలా మంది అభిమానులు దీనిని దేశభక్తికి వ్యతిరేకంగా భావిస్తున్నారు. సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ మధ్య జరగబోయే ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఇప్పటికీ చర్చనీయాంశమైంది. ఈ వివాదం ఇప్పుడు మ్యాచ్ కు ముందు ఉద్రిక్తతను మరింత పెంచింది.