Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభానికి ఇంకా 20 రోజులే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ జాకర్ అలీ అనిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది ఆసియా కప్ టైటిల్‌ను గెలవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్ జట్టు ఇప్పటివరకు ఆసియా కప్ టైటిల్‌ను ఒక్కసారి కూడా గెలవకపోవడం గమనార్హం. ఇంతకు ముందు 3 సార్లు(2012, 2016, 2018) ఫైనల్ చేరుకున్నప్పటికీ, ప్రతిసారీ చివరి అడుగులో ఓటమి పాలైంది.
ఈ సారి ఎలాగైనా ఆసియా కప్ టైటిల్ గెలిచి తమ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలకాలని బంగ్లాదేశ్ వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే 20 మంది ఆటగాళ్లతో కూడిన ప్రిలిమినరీ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతే కాకుండా ఆసియా కప్ టోర్నమెంట్ కోసం యూఏఈలో ఒక ప్రత్యేక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. ఇటీవలే బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ నాయకత్వంలో శ్రీలంక, పాకిస్థాన్‌లతో జరిగిన టీ20 సిరీస్ లను గెలుచుకుని మంచి ఫామ్‌లో ఉంది.

జాకర్ అలీ అనిక్ ఏమన్నారంటే...
మీడియా సమావేశంలో జాకర్ అలీ మాట్లాడుతూ.."టైటిలే లక్ష్యంగా ఈసారి ఆసియా కప్‌లో బరిలోకి దిగుతున్నాం. ఈసారి ఛాంపియన్లుగా నిలుస్తామన్న నమ్మకం మా డ్రెస్సింగ్ రూమ్‌లోని ప్రతి ఒక్కరికీ ఉంది. మా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఒక్కరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మేము ఏ జట్టును కూడా తేలికగా తీసుకోవడం లేదు. ఈ టోర్నమెంట్‌లో మాకు ప్రత్యేక ప్రణాళికలేవీ లేవు, కానీ ఏ జట్టుతో ఆడినా మా సహజసిద్ధమైన ఆటను కొనసాగించాలని అనుకుంటున్నాం. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం" అని అన్నారు.
ఆసియా కప్ 2025 బంగ్లాదేశ్ ప్రిలిమినరీ జట్టు:
బ్యాట్స్‌మెన్: లిట్టన్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, ఎండి నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, మహ్మద్ పర్వేజ్ హోస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హుస్సేన్, నజ్ముల్ హోస్సేన్, మహిదుల్ ఇస్లాం భుయాన్ అంకోన్, మహ్మద్ సైఫ్ హసన్.
ఆల్-రౌండర్లు/బౌలర్లు: మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, షాక్ మహేదీ హసన్, తన్వీర్ ఇస్లాం, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, సైఫుద్దీన్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం, సయ్యద్ ఖలీద్ అహ్మద్.
గ్రూప్ వివరాలు: ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ జట్టు గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో బంగ్లాదేశ్‌తో పాటు శ్రీలంక, హాంకాంగ్, ఒమన్ జట్లు ఉన్నాయి.