బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 మ్యాచులో టీమిండియా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. కేవలం యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్ మాత్రమే రాణించారు. గిల్ 121 పరుగులతో అద్భుతంగా ఆడాడు. అతను చివరి వరకు క్రీజులో ఉంటే భారత్ ఈ మ్యాచ్ గెలవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఒత్తిడికి గురైన అతను భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.
ఈ మ్యాచులో అతని అద్భుత ఇన్నింగ్స్ వల్లనే భారత జట్టు చివరి వరకు పోరాడిందని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గిల్ ఆడింది సరైన షాట్ కాదని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. గిల్, యువీ ఇద్దరూ పంజాబ్‌కు చెందిన వారే. దీంతో యువీతో గిల్‌కు మంచి అనుబంధం ఉంది.

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రాహుల్, సూర్యకుమార్, అక్షర్ అందరితో గిల్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కానీ సెంచరీ చేసిన తర్వాత ఎటాకింగ్ గేమ్ ఆడేందుకు అతను ప్రయత్నించాడు. ఈ క్రమంలో మెహదీ హసన్ వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ మరుసటి బంతికే మరో భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు. ఈ క్రమంలో గిల్ పెట్టిన ఒక ఇన్‌స్టా పోస్టుపై యువరాజ్ స్పందించాడు.
'ఒక చెత్త షాట్ ఆడి అవుటయ్యావ్. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే వాడివి. ఏదేమైనా చక్కగా ఆడావ్' అని యువీ కామెంట్ చేశాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్ కూడా తను అవుటైన విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ టైంలో అలాంటి షాట్ ఆడకుండా ఉండాల్సిందని అన్నాడు. ఇప్పుడు యువీ కూడా అదే మాట చెప్పడం గమనార్హం.