క్రికెట్‌లో అత్యంత పెద్ద వైరం ఏదైనా ఉందంటే అది భారత్, పాకిస్తాన్ అని చెప్పాలి. ఈ రెండు జట్లు తలపడే మ్యాచులు ఎప్పుడు జరిగినా స్టేడియం నిండిపోతుంది. వ్యూయర్‌షిప్ రేటింగ్ రికార్డులు బద్దలైపోతాయి. ఆటగాళ్లపై కూడా అదే మాదిరి ఒత్తిడి ఉంటుంది. దీన్ని తగ్గించి చూపించడానికి వాళ్లు ప్రయత్నిస్తుంటారు.
గత కొన్నేళ్లలో భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీసులు ఏవీ జరగలేదు. రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడమే దీనికి కారణం. కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు టీమ్స్ తలపడ్డాయి. దీంతో ఈ మ్యాచుల పాపులారిటీ మరింత పెరిగిందని చెప్పాలి. ఎంతలా అంటే.. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ వ్యూయర్‌షిప్ రికార్డులన్నీ తిరగరాసింది.

దీంతో ఆసియా కప్, వరల్డ్ కప్‌లో భారత్, పాక్ మ్యాచులు తలచుకుంటే ఎవరికైనా ఒత్తిడి తప్పదు. తాజాగా విరాట్ కోహ్లీ దీని గురించి స్పందించడం గమనార్హం. మిగతా మ్యాచులతో పోలిస్తే.. పాక్‌తో మ్యాచ్ సమయంలో డ్రెస్సింగ్ రూం వాతావరణం చాలా భిన్నంగా ఉంటుందని చెప్పాడు.
బయట ఫ్యాన్స్ సృష్టించే హైప్‌ను ప్లేయర్లు పట్టించుకోకుండా ఉండలేరని, దీంతో డ్రెస్సింగ్ రూం వాతావరణం మారిపోతుందని చెప్పాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతుందని వివరించాడు. అయితే స్టేడియంలో అడుగు పెట్టిన తర్వాత అంతా సర్దుకుంటుందని, ఈ ఒత్తిడి నుంచి బయటపడి తమ పని తాము చేసుకుంటామని వివరించాడు.
'మిగతా మ్యాచులతో పోలిస్తే పాక్‌తో మ్యాచుల సమయంలో బయట వాతావరణం చాలా చాలా భిన్నంగా ఉంటుంది. అలాంటిదేం లేదని నేను చెప్పలేను. ఈ టెన్షన్‌ను పట్టించుకోకుండా ఉండలేం. కానీ ఒక ప్లేయర్‌గా మైదానంలో అడుగు పెడితే.. అది కూడా ఒక మ్యాచ్ అంతే. అక్కడి వాతావరణం నిన్ను కూడా ఎగ్జయిట్ చేయొచ్చు. దాన్ని ఎంజాయ్ చేయడం మన బాధ్యత' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.