మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ మొదలవుతుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే టీమిండియాకు అంత సీన్ లేదని, ఈ మ్యాచ్‌లో కచ్చితంగా పాకిస్తాన్ టీం పైచేయి సాధిస్తుందని ఆ టీం మాజీ దిగ్గజం దానిష్ కనేరియా అంటున్నాడు.
భారత జట్టు ఇంకా పూర్తిగా సెట్ అయినట్లు కనిపించడం లేదని అన్నాడు. విండీస్ పర్యటనలో టీమిండియా చేసిన ప్రయోగాలు చూసిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్‌కు కూడా ఇదే అనుమానం కలిగింది. నాలుగో స్థానంలో సంజూ రాణించినా.. అతన్ని ఆ స్థానంలో దింపకపోవడం, లైనప్‌లో కొత్త ప్రయోగాలతో ఫ్యాన్స్‌కు విండీస్ టూర్ తలనొప్పులే మిగిల్చింది.

ఈ క్రమంలోనే భారత్, పాక్ మ్యాచ్ గురించి దానిష్ కనేరియా మాట్లాడాడు. 'ఈ మ్యాచ్‌లో కచ్చితంగా పాకిస్తాన్ మెరుగైన స్థితిలో ఉంది. ఎందుకంటే టీమిండియా ఇంకా సెట్ అయినట్లు కనిపించడం లేదు. ఏ పేసర్లను తీసుకోవాలి? అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. స్పిన్నర్లలో చాహల్ ఏమాత్రం నిలకడ లేకుండా ఆడుతున్నాడు' అని టీమిండియా సమస్యలను కనేరియా ఎత్తిచూపాడు.
'నన్నడిగితే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాను స్పిన్నర్లుగా తీసుకోవడం బెటర్. బ్యాకప్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయిని ఆడించొచ్చు' అని అభిప్రాయపడ్డాడు. ఇక ఆసియా కప్ నాటికి టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ కోలుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి గురించి కూడా కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు.
'కేఎల్ రాముల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ ఎన్సీయేలో బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్లను ఆసియా కప్‌లో ఆడిస్తారనే అనిపిస్తోంది. కానీ బాగా ప్రాక్టీస్ చేశారని ఎవరినీ నేరుగా టీంలోకి తీసుకోలేం. వాళ్లు మ్యాచులు ఆడి, రాణించిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే జట్టులోకి తీసుకోవాలి. లేకపోతే వాళ్లు ఎలా ఆడతారో చెప్పలేం' అని అన్నాడు.