ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచులో భారత జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచులో మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తేలిపోయాడు. స్పిన్నర్లు విజృంభిస్తున్న పిచ్‌పై తన ఫేవరెట్ స్వీప్ షాట్‌కు సూర్య ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. కనిపించిన ప్రతి బంతిని స్వీప్ చేయడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన షకీబల్ హసన్ అద్భుతమైన డెలివరీతో సూర్యను పెవిలియన్ చేర్చాడు.
ఈ ఇన్నింగ్సులో సూర్య 34 బంతులు ఎదుర్కొని 26 పరుగులే చేశాడు. వరల్డ్ కప్ ముందు వన్డేల్లో సత్తా నిరూపించుకునే అవకావాన్ని సూర్య చేజార్చుకున్నాడు. దీనిపై మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా స్పందించాడు. సూర్య ఇలా కేవలం స్వీప్ షాట్ మీదనే ఆధారపడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాడు.

ఇలాంటి మంచి అవకాశాన్ని సూర్య చేజార్చుకోవడం గురించి ప్రశ్నించగా.. 'ఈ పిచ్ కొంత భిన్నంగా ఉంది. కొంత స్పిన్, బౌన్స్ ఉంది. అలాగే బంగ్లా బౌలర్లు కూడా చక్కని పేస్‌తో బౌలింగ్ చేశారు. సూర్య స్వీప్ షాట్ ఆడుతున్నా కూడా కేవలం సింగిల్ మాత్రమే వస్తోంది. ఇలా ఒక్క రన్ కోసం సూర్య మరీ పెద్ద రిస్క్ తీసుకున్నాడని నా ఫీలింగ్' అని చెప్పాడు.
'ఇది సూర్య ఫేవరెట్ షాట్. కానీ అలాంటి షాట్లే ఒక్కోసారి మనల్ని ఇబ్బంది పెడతాయి. ఈ మ్యాచ్ పరిస్థితి వేరు. డౌన్ ది గ్రౌండ్ కూడా సూర్య చక్కగా ఆడతాడు. ఈసారి కూడా అలాగే చేయాల్సింది. కానీ తన స్వీప్ షాట్‌పై సూర్యకు మరీ ఎక్కువ కాన్ఫిడెంట్ ఉండటంతో ఇలా ఆడాడు' అని పీయూష్ చావ్లా చెప్పుకొచ్చాడు. టీమిండియా 94/4 స్కోరుతో కష్టాల్లో ఉండగా సూర్య క్రీజులోకి వచ్చాడు.
దొరికిన ప్రతి బంతికీ స్వీప్ ఆడబోయి అవుటైపోయాడీ టీ20 స్పెషలిస్టు. వన్డేల్లో మంచి రికార్డు ఉన్న సంజూ శాంసన్ వంటి ప్లేయర్‌ను పక్కన పెట్టి సూర్యను తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సూర్య మరోసారి తను వన్డేల్లో పనికిరానని నిరూపించుకున్నట్లు అయింది.