పొట్టి ప్రపంచ కప్‌లో నెంబర్ వన్ బ్యాటర్ అయ్యుండి కూడా.. వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ ఘోరంగా విఫలం అవుతున్నాడు. ఐపీఎల్‌కు ముందు ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీసులో వరుసగా మూడు గోల్డెన్ డక్‌లు కూడా నమోదు చేశాడు. ఈ క్రమంలో వన్డే ఫార్మాట్‌ను సూర్య క్రాక్ చేయలేకపోతున్నాడంటూ విమర్శలు వస్తున్నాయి. అయినా సరే టీమిండియా మాత్రం అతనిపై నమ్మకం ఉంచి ఆసియా కప్‌కు సెలెక్ట్ చేసింది.
ఈ సందర్భంగా తన వైఫల్యాల గురించి సూర్య మాట్లాడాడు. 'అందరూ వన్డేలు ఎందుకు క్రాక్ చేయలేక పోతున్నావ్? అని అడుగుతుంటారు. కానీ వన్డేలు అంత ఈజీ కాదు. దీనిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడాల్సి వస్తుంది. మొదట్లో టైం తీసుకోవాలి. ఆ తర్వాత స్ట్రైక్ రొటేట్ చేయాలి. చివర్లో టీ20ల్లా భారీ షాట్లు ఆడాలి' అని వివరించాడు. టీ20లు, వన్డేలు వైట్ బాల్ ఫార్మాట్‌లే అయినా రెండింటి మధ్య చాలా తేడా ఉందన్నాడు.

'నాకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తా. ఈ ఫార్మాట్‌లో కూడా రాణించాలని అనుకుంటున్నా. టీ20ల్లో బాగానే ఆడుతున్నా. రెండూ వైట్ బాల్ ఫార్మాట్ అవడంతో.. పొట్టి ఫార్మాట్‌లో రాణిస్తున్న నేను వన్డేల్లో ఎందుకు ఆడలేక పోతున్నానని చాలా మంది అంటుంటారు. కానీ ఈ ఫార్మాట్ ఒక పెద్ద సవాల్. అందుకే కోచ్ రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్లందరితో మాట్లాడుతున్నా. అవసరమైన సలహాలు తీసుకుంటున్నా' అని సూర్య వెల్లడించాడు.
అలాగే ఈ ఫార్మాట్ కోసం దానికి అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు సూర్య చెప్పాడు. పరిస్థితికి తగినట్లు ఆడటం అలవాటు చేసుకుంటున్నానని అన్నాడు. 'పరిస్థితికి తగ్గట్లు నా ఆటను అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. దీనికోసం ప్రాక్టీస్ చేస్తున్నా. ఆసియా కప్‌లోనే వన్డే కోడ్ క్రాక్ చేస్తానని ఆశిస్తున్నా' అని తెలిపాడు. బ్యాటింగ్‌కు వెళ్లేప్పుడు పరిగెత్తడం గురించి మాట్లాడుతూ.. బ్యాటింగ్ చేయడం తనకు ఇష్టమని, ఆ మాత్రం ఎగ్జయిట్‌మెంట్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం అని చెప్పాడు.