ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ శ్రీలంక తమ స్థాయి చూపిస్తోంది. బంగ్లాతో పల్లెకెలె వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో లంకేయులు అదరగొడుతున్నారు. గతేడాది తాము ట్రోఫీ నెగ్గింది లక్ కాదని నిరూపిస్తున్నారు. బంగ్లాపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాను లంక బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు.
ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన బంగ్లా బ్యాటర్ తంజిద్ హసన్ కనీసం ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరాడు. స్టార్ స్పిన్నర్ తీక్షణ వేసిన డెలివరీని డిఫెండ్ చేసుకోవడానికి హసన్ ప్రయత్నించాడు. లెగ్ స్టంప్ లైన్‌లో తీక్షణ వేసిన బంతి.. మిడిల్ వికెట్ వైపు కొద్దిగా మళ్లింది. దాన్ని హసన్ అడ్డుకోవడంలో తడబడ్డాడు. దీంతో ఎల్బీడబ్ల్యూగా అవుటైన హసన్.. అరంగేట్రంలోనే డకౌట్ అయి వెనుతిరిగాడు.

ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించిన మరో ఓపెనర్ మహమ్మద్ నైమ్ (16)ను లంక పార్ట్ టైం స్పిన్నర్ ధనంజయ డిసిల్వ పెవిలియన్ చేర్చాడు. డిసిల్వ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. దీంతో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని నిస్సంక చక్కగా పట్టేశాడు. దీంతో నైమ్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఇలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ ఒక బౌండరీ బాది ఇన్నింగ్స్‌లో ఊపు తెచ్చాడు. కానీ ఆ తర్వాత మరో షాట్ ఆడేందుకు చాలా కష్టపడ్డాడు. అప్పుడు బంతి అందుకున్న సీఎస్‌కే యంగ్ పేసర్ పతిరాణా బౌలింగ్‌లో కేవలం 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఆఫ్‌సైడ్ ఆవలగా వేసిన షార్ట్ బాల్‌ను కట్ చేసేందుకు షకీబల్ హసన్ ప్రయత్నించాడు.

ఈ క్రమంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. కీపర్ కుశాల్ మెండిస్‌కు ఎడం చేతి వైపు వెళ్లింది. వేగంగా రియాక్ట్ అయిన మెండిస్.. జంప్ చేసి ఒంటి చేత్తో పట్టేశాడు. థర్డ్ అంపైర్ ఈ క్యాచ్ చెక్ చేసి అది క్లీన్ క్యాచ్ అని కన్ఫర్మ్ చేశాడు. దీంతో షకీబల్ హసన్ కూడా నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో బంగ్లా టీం 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.