శ్రీలంకతో జరిగే ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌తో మ్యాచులో గాయాలపాలైన స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఈ ఫైనల్‌కు దూరమయ్యాడు. బంగ్లాతో మ్యాచులో అక్షర్ చేతికి, కాలికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను ఆసియా కప్ ఫైనల్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. వీటిపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ.. అక్షర్ ఆడటం లేదని వెల్లడించింది.
'బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 మ్యాచులో అక్షర్ పటేల్ గాయపడ్డాడు. దీంతో అతను ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతని రిప్లేస్‌మెంట్‌గా వాషింగ్టన్ సుందర్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. తను కొలంబో చేరుకొని జట్టుతో కలిశాడు' అని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే సుందర్‌కు ఫైనల్ ఆడే తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే అని నిపుణులు భావిస్తున్నారు.

బంగ్లాతో మ్యాచులో భారత జట్టు ఓటమి అంచున నిలిచింది. అలాంటి సమయంలో అక్షర్ పటేల్ (42) అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అతనికి కనుక గాయాలు కాకపోయి ఉంటే టీంను గెలిపించి ఉండేవాడు. కానీ గాయాలు అవడం, దానికి తోడు కావలసిన రన్ రేట్ పెరగడం, అవతలి ఎండ్‌లో బ్యాటర్లు లేకపోవడంతో అక్షర్‌పై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. దీంతో భారీ షాట్లు ఆడబోయిన అతను అవుటైపోయాడు.
అక్షర్ రిప్లేస్‌మెంట్‌గా తీసుకున్న సుందర్‌కు జట్టులో చోటు దక్కుతుందా? అని అందరూ ఆలోచిస్తున్నారు. 'తన ఆఫ్‌స్పిన్‌తో వికెట్లు తీసుకొని, ఎక్కడ బ్యాటింగ్ చేసినా పరుగులు చేస్తే వాషింగ్టన్ సుందర్ మంచి టెంప్టింగ్ ఆప్షన్. టీమిండియాలో ఆఫ్‌స్పిన్నర్లు లేరు. ఇది జట్టుకు అవసరమైన మార్పు కావొచ్చు. అందుకైనా అతన్ని జట్టులోకి తీసుకునే అవాకశం ఉంది' అని మాజీ దిగ్గజం ఆకాష్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరి సుందర్‌కు టీంలో చోటు దక్కుతుందా? అనేది చూడాలి.