ఆసియా కప్‌లో సీఎస్‌కే బౌలర్లు చెలరేగారు. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక టీంలో మహీష్ తీక్షణ, మతీష పతిరాణా ఇద్దరూ బంతితో అదరగొట్టారు. దీంతో బంగ్లా టైగర్స్ తేలిపోయారు. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లంక ముందు భారీ స్కోరు నిలపాలని అతను అనుకున్నాడు. అయితే షకీబల్ ఆశలను సీఎస్‌కే బౌలర్లు ఆవిరి చేశారు.
ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే తీక్షణ బౌలింగ్‌లో అరంగేట్ర బ్యాటర్ తంజిద్ హసన్ (0) డకౌట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి బంగ్లా బ్యాటింగ్ పతనం మొదలైంది. మరో ఓపెనర్ మహమ్మద్ నైమ్ (16) కూడా పెద్దగా రాణించలేదు. మూడో స్థానంలో వచ్చిన షాంటో (89) ఒక్కడే చివరి వరకు పోరాటం కొనసాగించాడు. కానీ అతనికి ఎవరూ సరైన సహకారం అందించలేకపోయారు.

కెప్టెన్ షకీబల్ హసన్ (5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అలాగే వెటరన్ ముష్ఫికర్ రెహ్మాన్ (13), మెహదీ హసన్ మిరాజ్ (5), మెహదీ హసన్ (6), టస్కిన్ అహ్మద్ (0), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (0), షోరిఫుల్ ఇస్లామ్ (2 నాటౌట్) ఒక్కరు కూడా ఆకట్టుకోలేదు. బంగ్లా బ్యాటర్లలో ఏడుగురు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారంటేనే వారి బ్యాటింగ్ ఎంత ఘోరంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
షాంటో మినహా కేవలం తౌహీద్ హృదోయ్ (20) మాత్రమే 20 పరుగుల స్కోరు చేయగలిగాడు. అదే సమయంలో పతిరాణా ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగాడు. తీక్షణ కూడా 8 ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ధనంజయ డిసిల్వ, దునిత్ వెల్లలెగె, దాసున్ షనక తలో వికెట్ తీసుకున్నారు. దీంతో బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో కేవలం 164 పరుగులే చేసి ఆలౌట్ అయింది.
ముందుగా బ్యాటింగ్ చేసి, లంక ముందు భారీ స్కోరు నిలపాలన్న బంగ్లా లక్ష్యం దారుణంగా దెబ్బతిన్నది. తను వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో చివరగా వన్డే మ్యాచులు ఆడానని ఈ సందర్భంగా పతిరాణా గుర్తుచేసుకున్నాడు. ఎక్కువ మ్యాచులు ఆడకపోయినా పిచ్ నుంచి సహకారం అందడంతో రాణించానని అన్నాడు. ఇన్నింగ్స్ రెండో సగంలో పిచ్ బాగా డెడ్ అయిపోయిందని, అందుకే స్లోబాల్స్ వేశానని చెప్పాడు.