ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచులో ఓడిపోయిన భారత జట్టు.. ఫైనల్‌లో శ్రీలంకను ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఒకరోజు విశ్రాంతి తీసుకున్న టీమిండియా ప్లేయర్లు.. ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధం అవుతున్నారు. బంగ్లాదేశ్‌తో మ్యాచులో భారీ మార్పులు చేసిన భారత టీం.. ఆసియా కప్ ఫైనల్‌లో పూర్తి బలం ఉన్న జట్టుతో బరిలో దిగనుంది.
బంగ్లాతో మ్యాచులో కోహ్లీ, పాండ్యా, కుల్దీప్, బుమ్రా, సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆసియా కిరీటం ఎవరిదో తేల్చే మ్యాచులో వీళ్లు ఐదుగురు ఆడనున్నారు. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ కీలక పోరుకు ముందు ఒక చిన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిలో ఒక లిఫ్టు ముందు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఏదో విషయంలో మాట్లాడుకుంటూ కనిపించారు.

గిల్ ఏదో అడగడంతో రోహిత్ చాలా చికాకుగా బదులిచ్చాడు. 'అది నా వల్ల కాదు. నీకేమైనా పిచ్చి పట్టిందా?' అని రోహిత్ అనడం వీడియోలో వినిపించింది. దీన్ని నెట్టింట పంచుకున్న కొందరు.. అసలు గిల్ ఏం అడిగి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియని ఫ్యాన్స్.. ఇక ఈ వీడియోతో ఆడుకోవడం మొదలు పెట్టారు. గిల్ ఏం అడిగి ఉంటాడని వాళ్లకు తోచిన సమాధానాలు చెప్తున్నారు.
వీటిలో చాలా వరకు ఫన్నీగా ఉండటంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 'రోహిత్ తన వల్ల కాదంటున్నాడు. ఇంతకీ గిల్ ఏం అడిగి ఉంటాడు?' అనే ప్రశ్నకు.. 'లిఫ్ట్ ఎక్కకుండా మెట్లు ఎక్కుదాం అని గిల్ అడిగి ఉంటాడు. రోహిత్ తన వల్ల కాదంటున్నాడు' అంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు. మరికొందరేమో రోహిత్ బ్యాటింగ్‌పై చురకలేశారు.
'మొదటి పది ఓవర్లలో లూజ్ షాట్లు వద్దన్నాడు గిల్. వల్ల కాదంటున్నాడు రోహిత్' అని ఎటకారం ఆడుతున్నారు. ఏదేమైనా ఈ వీడియో ఒప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన వాళ్లంతా తమకు తోచిన సమాధానం చెప్తూ దీన్ని మరింత ట్రెండ్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం? మీ మనసులో ఏముందో కూడా చెప్పేయండి.