శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్‌లో భారత జట్టు టాస్ ఓడింది. చాలా డ్రైగా ఉన్న ఈ పిచ్‌పై టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే టాస్ మాత్రం శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక గెలిచాడు. తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో లంక కీలక స్పిన్నర్ మహీష్ తీక్షణ ఆడటం లేదు. అతను గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
అతని స్థానంలో దుషన్ హేమంత ఆడుతున్నట్లు షనక చెప్పాడు. ఇక భారత జట్టు పూర్తి బలంతో బరిలో దిగుతోందని, గత మ్యాచులో విశ్రాంతి తీసుకున్న ఐదుగురు కీలక ప్లేయర్లు తిరిగి జట్టులోకి వచ్చారని రోహిత్ వెల్లడించాడు. అలాగే అక్షర్ గాయంతో మ్యాచ్‌కు దూరమైనట్లు చెప్పాడు. దీంతో అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఆడుతున్నట్లు ప్రకటించాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ గాయపడిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను ఆడిస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ స్పిన్‌కు సహకరించే పిచ్ కావడంతో వాషింగ్టన్ సుందర్‌కే టీం మేనేజ్‌మెంట్ ఓటు వేసింది. దీంతో శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌కు దూరమవుతున్నాడు. అలాగే బంగ్లాదేశ్‌పై తాము దాదాపు ఛేజ్ పూర్తి చేశామని, ఆ కాన్ఫిడెంట్‌తోనే బరిలో దిగుతున్నామని రోహిత్ చెప్పాడు.
ఈ మ్యాచ్ నెగ్గితే భారత్ 8వ సారి ఆసియా కప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. అదే శ్రీలంక నెగ్గితే 7 సార్లు ఆసియా కప్ గెలిచి, భారత్ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుందీ జట్టు. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం పడి ఆగిపోతే.. సోమవారం నాడు రిజర్వ్ డేలో మిగతా మ్యాచ్ జరుగుతుంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.