ఆసియా కప్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే టీమిండియా ప్లేయర్లు శ్రీలంక చేరుకుంటున్నారు. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచులన్నీ లంకలోనే జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రయం నుంచి శ్రీలంక బయలుదేరిన రోహిత్.. ఈసారి ఆసియా కప్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
గతంలో కూడా రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్ నెగ్గిన సంగతి తెలిసిందే. 2018లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ సారధ్యంలో టీమిండియా ఆ టోర్నీలో తలపడింది. ఫైనల్‌లో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈసారి కూడా రోహిత్ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే జరిగితే రోహిత్ తన పేరిట అరుదైన రికార్డు లిఖించుకుంటాడు.

ఇప్పటి వరకు భారత కెప్టెన్లలో రోహిత్ మినహా సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, మహమ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోనీ మాత్రమే ఆసియా కప్ ట్రోఫీ ముద్దాడారు. ఈసారి కూడా రోహిత్ కనుక ట్రోఫీ నెగ్గితే హిట్‌మ్యాన్ కూడా అజారుద్దీన్, ధోనీ తర్వాత రెండుసార్లు ఈ ట్రోఫీ నెగ్గిన కెప్టెన్‌గా రికార్డు సృష్టిస్తాడు. వరల్డ్ కప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ ఆసియా కప్‌ను టీమిండియా నెగ్గుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇదే కాన్ఫిడెన్స్ రోహిత్ కూడా చూపిస్తున్నాడు. ముంబై విమానాశ్రయంలో అతను ఉండగా విలేకరులు అతన్ని గమనించి, ఈ ఏడాది ఆసియా కప్ నెగ్గే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన రోహిత్.. 'జీతేంగే.. జీతేంగే..' (గెలుస్తాం.. గెలుస్తాం..) అని సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా టీమిండియా కచ్చితంగా ఈ ట్రోఫీ నెగ్గుతుందని ఫీలవుతున్నారు.