పాకిస్తాన్ మరోసారి వింత వ్యాఖ్యలతో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ముందు ఆసియా కప్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్‌కు దక్కాయి. కానీ బీసీసీఐ మాత్రం టీమిండియాను పాకిస్తాన్ పంపించడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో చివరకు ఈ లీగ్‌ను హైబ్రీడ్ మోడల్లో నిర్వహించారు.
చెప్పడానికి హైబ్రీడ్ మోడల్ అయినా కూడా.. అధిక శాతం మ్యాచులన్నీ శ్రీలంక వేదికగానే జరిగాయి. ఫైనల్, గ్రూప్-4 మ్యాచులు కూడా ఎక్కువగా శ్రీలంకలోనే జరిగాయి. ఇదే విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమకు నష్టపరిహారం కావాలని డిమాండ్ చేసింది. తమ జట్టును శ్రీలంకకు తిప్పడానికి ఛార్టర్డ్ ఫ్లైట్‌లు ఉపయోగించామని పీసీబీ చెప్తోంది.

ఈ విమానాల చార్జీల ఖర్చు కూడా తమకు ఇవ్వాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)ని పీసీబీ కోరుతోంది. ఆసియా కప్‌లో కేవలం నాలుగు మ్యాచులకే పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. అయినా సరే ఏసీసీ నుంచి 2.5 లక్షల డాలర్ల ఫీజును పీసీబీ తీసుకుంటుంది. ఈ హోస్టింగ్ ఫీజు కాకుండా అదనంగా విమాన చార్జీలు కూడా చెల్లించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది..
'ఈ అదనపు ఖర్చులన్నీ కూడా ముందుగా అనుకున్న ఆసియా కప్ బడ్జెట్‌లో లేవు. పాకిస్తాన్, శ్రీలంక మధ్య జట్లను తిప్పేందుకు అయిన ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు, అలాగే జట్టు సభ్యుల కోసం హోటల్ బుకింగ్‌లు ఇవే అదనపు ఖర్చులు' అని పీసీబీ వెల్లడించింది.
తమ జట్టును శ్రీలంకకు పంపేందుకు ఒక లంక కంపెనీతో పీసీబీ ఒప్పందం చేసుకుందట. దీని కోసం నాలుగు ఛార్టెర్డ్ విమానాలను ఏర్పాటు చేయగా.. వీటి కోసం ఏకంగా 2.81 లక్షల డాలర్లకు ఈ ఒప్పందం జరిగిందట. ఈ సొమ్ము ముందుగా చెల్లించి విమానాలను ఏర్పాటు చేసిందట పీసీబీ.
ఈ విమానాల్లో ఫ్యాన్స్‌కు కూడా టికెట్లు అమ్మాలని పీసీబీ ముందుగా అనుకుందట. కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టేసిందట. ఈ విషయంలో ఏసీసీ చాలా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. హోస్టింగ్ ఫీజుతోపాటు టికెటింగ్, స్పాన్సర్‌షిప్‌లో భాగం మాత్రమే ఇస్తామని తేల్చిచెప్పిందట.