భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. కానీ వరుణుడు వీళ్ల ఆశలపై నీళ్లు చల్లేందుకు రెడీ అవుతున్నాడు. మ్యాచ్ జరిగే సమయంలో పల్లెకెలెలో 90 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో ఫ్యాన్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. అదే సమయంలో ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం క్యాండీలో ఉదయం వర్షం పడే అవకాశం 67 శాతం ఉంది. అదే సాయంత్రం అయితే ఇది 94 శాతానికి చేరుతోంది. ఈ మ్యాచ్ మొదలయ్యేది ఈ సమయంలో కావడం గమనార్హం. ఇదే జరిగి వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పాయింట్లను రెండు టీమ్స్‌కు సమానంగా పంచుతారు. అంటే భారత్, పాక్ రెండు జట్లు చెరో పాయింట్ తీసుకుంటాయి.

అలా కాకుండా డక్‌వర్త్ లూయిస్ విధానంలో మ్యాచ్ ఫలితం తేలాలన్నా కూడా.. రెండు జట్లు కనీసం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉండాలి. లేదంటే ఈ మ్యాచ్ ఫలితాన్ని పరిగణనలోకి తీసుకోవడం కుదరదు. అదే కనుక మొదట బ్యాటింగ్ చేసిన జట్టు పూర్తి ఓవర్లు ఆడి, ఛేజింగ్ మధ్యలో వర్షం పడితే.. ఛేజింగ్‌లో వేయాల్సిన ఓవర్ల పర్సంటేజితో తొలి ఇన్నింగ్స్ స్కోరును గుణిస్తారు. దీన్ని బట్టి విజేతను నిర్ణయిస్తారు.
ఈ కథ ఇక్కడితో ఆగదు. ఇప్పటికే నేపాల్‌ను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్.. భారత్‌తో మ్యాచ్ రద్దయినా కూడా సూపర్-4 దశకు చేరుతుంది. భారత్ మాత్రం తమ బెర్తు కోసం నేపాల్‌తో తలపడాల్సి ఉంటుంది. క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నేపాల్ నుంచి బలమైన భారత్‌కు పెద్ద సమస్య ఉండకపోవచ్చు. కానీ వర్షం వల్ల పాక్ మ్యాచ్ రద్దయితే.. నేపాల్ మ్యాచ్ పూర్తయ్యే వరకూ అధికారికంగా భారత జట్టు సూపర్-4లో అడుగు పెట్టినట్లు కాదు.