ఆసియా కప్‌లో అందరూ ఎదురు చూసిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫలితం తేలకుండానే ఆగిపోయింది. అయితే సూపర్-4 దశలో ఈ రెండు టీమ్స్ మరోసారి తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి పాక్‌తో తలపడితే కేఎల్ రాహుల్‌ను తీసుకోవాలా? లేక ఇషాన్ కిషన్‌ను ఆడించాలా? అని డిబేట్ జరుగుతోంది. గ్రూప్ దశలో భారత టాపార్డర్ విఫలమైన వేళ కిషన్ అద్భుతంగా ఆడిన సంగతి తెలిసిందే.
గ్రూప్ దశలో భారత్, పాక్ ఆడిన మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ బాగా దెబ్బతిన్నది. అలాంటి సమయంలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా కలిసి జట్టును గట్టెక్కించారు. కీలకమైన భాగస్వామ్యంలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ పట్టుదల చూపించి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో తొడ కండరాలు పట్టేయడంతో భారీ షాట్లు ఆడబోయి అవుటయ్యాడు.

ఈ క్రమంలో మరోసారి పాక్‌తో జరిగే మ్యాచ్‌లో కిషన్‌ను ఆడించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కనుక కిషన్‌ను కాదని రాహుల్‌ను తీసుకుంటే అది చాలా పెద్ద తప్పని మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కూడా అంటున్నారు. 'రాహుల్ కన్నా ముందు కిషన్‌ను కనుక ఆడించకపోతే.. టీమిండియా అతి పెద్ద పొరపాటు చేసినట్లే' అని గౌతీ చెప్పాడు. మరో మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా దీనికి అంగీకరించాడు.
జట్టులో స్థానం సుస్థిరం కాకపోయినా కూడా.. అవకాశం దక్కిన ప్రతిసారీ కిషన్ రాణించాడని చోప్రా మెచ్చుకున్నాడు. ఒత్తిడిలో పరుగులు చేయడం కష్టమని, కానీ కిషన్ ఒత్తిడిలో కూడా ఆకట్టుకున్నాడని చెప్పాడు. 'కిషన్‌కు ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ వచ్చిన వాటిని మాత్రం రెండు చేతులతో పట్టుకున్నాడు. డబుల్ సెంచరీ బాదినా కూడా అతనిక అవకాశాలు రావడం లేదు. అతను వన్డే ఫార్మాట్ కోడ్‌ను క్రాక్ చేశాడు. ఈ ఫార్మాట్ నాడి పట్టేశాడు కాబట్టే అంత బాగా రాణిస్తున్నాడు' అని కొనియాడాడు.