క్రికెట్ ప్రేమికులు అందరూ ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం వచ్చేసింది. మరికొన్ని గంటల్లో ఈ మ్యాచ్ మొదలవుతుంది. దీంతో రెండు దేశాల ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇలాంటి సమయంలో అభిమానులకు గట్టి షాకిచ్చే వార్త బయటకు వచ్చింది. శనివారం జరిగే భారత్, పాక్ మ్యాచ్ అసలు జరగడం అనుమానంగా మారింది.
కాండీ వేదికగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే శనివారం నాడు ఈ ప్రాంతంలో భారీ వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలగొల్ల తుఫాను ఈ మ్యాచ్‌ను అడ్డుకునే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఈ వార్తలు విన్న ఫ్యాన్స్ అందరూ కూడా టెన్షన్ పడిపోతున్నారు. ఈ మ్యాచ్ టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన నిమిషాల్లోనే అన్నీ అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.

కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వరుణుడు ఈ ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తున్నాడు. దానికితోడు 2019 వరల్డ్ కప్ తర్వాత వన్డే ఫార్మాట్‌లో ఈ రెండు టీమ్స్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడం కూడా దీనిపై బాగా హైప్ పెంచింది. అసలే రెండు దేశాల మధ్య సంబంధాలు బాగలేక కేవలం ఆసియా కప్, ఐసీసీ ట్రోఫీల్లోనే ఈ రెండు దేశాలు తలపడుతున్నాయి.
ఇలాంటి సమయంలో లేక లేక జరుగుతున్న ఈ మ్యాచ్‌ను వర్షం అడ్డుకుంటుందనే వార్త ఫ్యాన్స్‌కు వణుకు పుట్టిస్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం కాండీలో మ్యాచ్ జరిగే రోజున 70 శాతం వర్షం పడే అవకాశం ఉందట. ముఖ్యంగా టాస్ వేసే సమయానికి వర్షం మొదలవ్వొచ్చని అంచనా. సాయంత్రం 6 గంటలకు కూడా 60 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
శుక్ర, శనివారాలు రెండ్రోజుల్లో కాండీలో వర్షం పడే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వార్తల మధ్యలో కూడా భారత్, పాక్ మ్యాచ్ ఆసాంతం జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీనికి వరుణుడు అడ్డుపడకుండా చూడాలని ప్రార్ధనలు చేస్తున్నారు. కాగా, ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను పాకిస్తాన్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో భారత జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లేకుండా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.