ఆసియా కప్‌లో భారత జట్టు తొలి మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 82 పరుగులు చేసి సత్తా చాటాడు. అయితే గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమైన కేఎల్ రాహుల్ తిరిగి వస్తే కిషన్ తప్పుకోవాల్సిందేనని కొందరు అంటున్నారు. ఇలాంటి వారికి మాజీ దిగ్గజం గౌతం గంభీర్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడుతుండగా.. టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్‌పై హాఫ్ సెంచరీ చేసినా కూడా, రాహుల్ వస్తే కిషన్ తప్పుకోవాల్సిందే అని కైఫ్ అన్నాడు. ఈ మాటలు గంభీర్‌కు ఏమాత్రం నచ్చలేదు. అంటే ప్లేయర్ ఫామ్ కన్నా కూడా అతని పేరు ముఖ్యమా? అంటూ కైఫ్‌కు చురకలేశాడు. దీంతో ఏం చెప్పాలో తెలియక కైఫ్ తెల్లమొఖం వేశాడు.

ఆసియా కప్ టీంలో చోటు దక్కినా కూడా గాయం కారణంగా కేఎల్ రాహుల్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గ్రూప్ దశలో భారత్ ఆడే రెండు మ్యాచులకు అతను దూరమయ్యాడు. ఈ క్రమంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కిషన్‌కు అవకాశం దక్కింది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న కిషన్.. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కానీ రాహుల్ వస్తే కిషన్ తప్పుకోవాల్సిందే అని కైఫ్ అన్నాడు.
'ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ మ్యాచ్ విన్నర్. ఈ స్థానంలో అతని గణాంకాలు చూస్తే ఈ విషయం తెలుస్తుంది. కాబట్టి రాహుల్ ఫిట్‌గా ఉంటే కిషన్ తప్పుకోక తప్పదు. కిషన్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతని గ్రాఫ్ పైకే వెళ్తుంది. డబుల్ సెంచరీ కూడా అతని పేరిట ఉంది. కానీ రాహుల్ స్థానాన్ని అతను ఇప్పుడే భర్తీ చేయలేడు. రాహుల్ ఫామ్‌లో లేక జట్టులో చోటు కోల్పోలేదు. గాయంతో ఉన్నాడని మర్చిపోకూడదు' అని కైఫ్ చెప్పాడు.
దీనిపై గంభీర్ ఘాటుగా స్పందించాడు. వరల్డ్ కప్ ఆడాల్సిన టైంలో ప్లేయర్ ఫామ్ ముఖ్యమా? లేక పేరు ముఖ్యమా? అని నిలదీశాడు. 'కోహ్లీ, రోహిత్‌లలో ఎవరైనా ఇలా వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు బాదారనుకో.. అప్పుడు వాళ్లు కూడా రాహుల్ కోసం తప్పుకోవాలని అంటావా? వరల్డ్ కప్ గెలవాలంటే పేర్లు చూడకూడదు. ట్రోఫీ గెలిపించగల ప్లేయర్ ఫామ్ చూడాలి' అని గంభీర్ బదులిచ్చాడు.
'జట్టులో చోటు కోసం ఏం చేయాలో అవన్నీ ఇషాన్ చేశాడు. కానీ రాహుల్ ఆడినన్ని అంతర్జాతీయ మ్యాచులు ఆడలేదు కాబట్టి.. ఈ వాదన చేస్తున్నారు. గాయాలైన ప్లేయర్ల స్థానంలో వచ్చిన వాళ్లు అద్భుతంగా ఆడితే.. తిరిగొచ్చే ప్లేయర్ వెయిట్ చేయక తప్పదు. ఇలా చాలా మంది వెయిట్ చేశారు. కొంత మందికి మళ్లీ అవకాశం కూడా దక్కలేదు. ఇదే రియాలిటీ' అని గట్టిగా చెప్పాడు.