ఇస్లామాబాద్: ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ అదరగొట్టింది. పసికూన నేపాల్‌పై విజృంభించింది. ఏకంగా 238 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సెంచరీతో అదరగొట్టిన కేప్టెన్ బాబర్ ఆజమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను అందుకున్నాడు. ఈ విజయంతో భారత్‌ను ఎదుర్కొనడానికి పాకిస్తాన్ సమాయాత్తమౌతోంది.
ముల్తాన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్- 151, ఇఫ్తికర్ అహ్మద్- 109 పరుగులు చేశారు. వారిద్దరు చెలరేగడంతో భారీ స్కోరును సాధించింది పాకిస్తాన్.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నేపాల్.. పాకిస్తాన్ బౌలర్ల ధాటికి ఎదురు నిలవలేకపోయింది. 23.4 ఓవర్లల్లో 104 పరుగులకే కుప్పకూలింది. మిడిలార్డర్ బ్యాటర్ సోమ్‌పాల్ కమీ చేసిన 28 పరుగులే నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్‌లో టాప్ స్కోర్. ఆరిఫ్ షేక్- 26, గుల్షన్ ఝా- 13 మాత్రమే డబుల్ డిజిట్‌ను అందుకోగలిగారు.
ఈ గెలుపు ఇచ్చిన ఊపుతో తన తదుపరి మ్యాచ్‌లో బలమైన భారత జట్టును ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోన్న వేళ.. పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ షహీన్ అఫ్రిది అనారోగ్యానికి గురయ్యాడు. ఇది ఆ జట్టులో ఆందోళనను నింపింది. అతని ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు పాకిస్తాన్ టీమ్ మేనేజ్‌మెంట్.
నేపాల్‌తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యాడు షహీన్ అఫ్రిది. తీవ్ర అలసటకు గురయ్యాడు. మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్‌ను వీడాడు. అయిదు ఓవర్లల్లో 27 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టిన అనంతరం డిస్ కంఫర్ట్‌గా కనిపించాడు. టీమ్ డాక్టర్, ఫిజియో సలహాతో మ్యాచ్ మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్ చేరాడు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో ముల్తాన్‌లో గరిష్ఠంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంత వేడిలో గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులను సంధించాల్సి రావడం వల్లే షహీన్ అఫ్రిది అలసటకు గురయ్యాడని తెలుస్తోంది. విశ్రాంతి తీసుకుంటే మళ్లీ గాడిన పడతాడని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. భారత్‌తో మ్యాచ్ నాటికి తేరుకుంటాడని అంచనా వేస్తోంది.