త్వరలో మొదలయ్యే ఆసియా కప్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ టోర్నీలో కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా గౌతమ్ గంభీర్ కామెంటరీ చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టోర్నీ కామెంటరీ ప్యానెల్‌లో గంభీర్ పేరు కూడా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడించారు.
చాలా మంది మాజీ దిగ్గజాలు ఉన్న ఈ జాబితా చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. వీరిలో ఐదుగురు భారతీయులు, నలుగురు పాకిస్తాన్ మాజీలు ఉన్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఆసియా కప్ మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో నాలుగు మ్యాచులు పాకిస్తాన్‌లో జరగ్గా.. మిగతా మ్యాచులన్నీ శ్రీలంక వేదికగా జరగనున్నాయి.

ఈ టోర్నీ కామెంటరీ ప్యానెల్‌లో భారత్ నుంచి రవిశాస్త్రి, గౌతమ్ గంభీర్, సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్, దీప్ దాస్ గుప్తా ఉన్నారు. ఇక పాకిస్తాన్ నుంచి చూసుకుంటే.. వసీం అక్రమ్, వకార్ యూనిస్, రమీజ్ రజా, బాజిద్ ఖాన్ ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి అథర్ అలీ ఖాన్, శ్రీలంక నుంచి రస్సెల్ ఆర్నాల్డ్ కామెంటరీ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్నారు.
అయితే ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ నుంచి ఎవరూ ఈ ప్యానెల్‌లో చోటు సంపాదించలేదు. న్యూజిల్యాండ్ మాజీ దిగ్గజం స్కాట్ స్టైరిస్‌కు ఈ ప్యానెల్‌లో చోటు దక్కింది. అతనొక్కడే ఈ ప్యానెల్‌లో న్యూట్రల్ వాయిస్ అని చెప్పొచ్చు. ఈ కామెంటరీ ప్యానెల్ అంతా.. గతేడాది ఆసియా కప్ కామెంటరీ ప్యానెల్‌లో ఉన్న సభ్యులే కావడం గమనార్హం.

కేవలం రమీజ్ రజానే కొత్తగా ఈ ప్యానెల్‌లో చేరాడు. గతేడాది అతను పీసీబీ చైర్మన్‌గా ఉండటంతో కామెంటేటర్‌గా పనిచేయలేదు. ఇటీవలి కాలంలో భారత్ ఆడిన దాదాపు అన్ని సిరీసుల్లో వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కామెంటేటర్‌గా సేవలందించాడు.
అలాగే సీనియర్ కామెంటేటర్ ఆకాష్ చోప్రాకు కూడా ఆసియా కప్ ప్యానెల్‌లో చోటు దక్కలేదు. ఇది గమనించిన ఫ్యాన్స్.. ఆకాష్ చోప్రా ఏమాత్రం ప్రొఫెషనలిజం లేని కామెంటేటర్ అని, అతను లేకపోవడమే మంచిదని అంటున్నారు.