విండీస్‌పై అరంగేట్రంలో రాణించిన తెలుగు తేజం తిలక్ వర్మకు బంపరాఫర్ దక్కింది. ఆసియా కప్ ఆడే టీంలో అతనికి సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. ఈ నిర్ణయం కరెక్టా? కాదా? అని ప్రస్తుతం తెగ చర్చ నడుస్తోంది. దీనిపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వెటకారమాడాడు.
వెస్టిండీస్‌పై టీ20ల్లో అరంగేట్రం చేసిన తిలక్ వర్మ తొలి మ్యాచ్ నుంచే రాణించాడు. ఈ సిరీసులో టీమిండియా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో అతన్ని ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీసుకు కూడా ఎంపిక చేశారు. డబ్లిన్ వేదికగా జరిగిన రెండు టీ20ల్లో తిలక్ ఘోరంగా ఫెయిలయ్యాడు.

తొలి మ్యాచ్‌లో తను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరిన తిలక్.. రెండో మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ఇలా వరుసగా అతను విఫలం అవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తిలక్‌ను ఆసియా కప్‌కు ఎంపిక చేయడంపై మంజ్రేకర్ జోకులు పేల్చాడు.
'తిలక్ దేశవాళీ కెరీర్ చూడండి. టీమిండియాలో చోటు సంపాదించే గణాంకాలు అతని సొంతం. మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. అంతేకాదు, ఇలా వన్డే ఫార్మాట్‌కు రెడీ అయ్యేందుకే తిలక్.. ఐర్లాండ్‌తో టీ20ల్లో ఫెయిలవుతున్నాడు. వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో ఫెయిలైన కారణం ఇదే. తన ఆటలో బలహీనత వెతకడం చాలా కష్టం' అని జోకులు వేశాడు.
'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిలక్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్. ముందే అనుకున్నట్లు నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఇంపాక్ట్ చూపించే క్వాలిటీ ప్లేయర్లు ఉండటం చాలా ముఖ్యం. భారత క్రికెట్‌లో తొలి మూడు స్థానాలకు చాలా గట్టి పోటీ ఉంది. మిగతా స్థానాల్లో ఇలాంటి మంచి ప్లేయర్లు ఉండటం చాలా కీలకం' అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.