ఆసియా కప్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన టీంపై పలు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గాయంతో చాలాకాలం ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌కు కూడా ఈ టీంలో చోటు దక్కింది. వీళ్లను ఆసియా కప్ టీంకు ఎంపిక చేయడంపై మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు.
ఇటీవలే బీసీసీఐ సెలెక్టర్లు.. ఆసియా కప్ కోసం భారత బృందాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 17 మంది ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. వీరిలో కేఎల్ రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలిపింది. మరి అలాంటి ప్లేయర్‌ను అసలు బృందంలోకి ఎలా తీసుకున్నారని కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశ్నించాడు. ఈ టీంను ఎంపిక చేసిన సెలెక్షన్ ప్యానెల్‌పై శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కేఎల్ రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అతనికి చిన్న గాయమైందని టీం అనౌన్స్‌మెంట్ సమయంలో చీఫ్ సెలెక్టర్ చెప్పాడు. ఆసియా కప్‌లో భారత్ ఆడే తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో. ఈ మ్యాచ్‌లో రాహుల్ ఆడటం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. అయితే రాహుల్‌కు ఇది తాజాగా తగిలిన దెబ్బ అని, పాత గాయం నుంచి తను పూర్తిగా కోలుకున్నాడని అగార్కర్ చెప్పాడు.
ఒకవేళ రాహుల్ కనుక టోర్నీకి దూరమైతే.. అతని స్థానాన్ని భర్తీ చేయడం కోసం ట్రావెలింగ్ స్టాండ్‌బై ప్లేయర్‌గా సంజూ శాంసన్‌ను బీసీసీఐ సెలెక్ట్ చేసింది. 'గాయం తగిలిన ప్లేయర్‌ను టీంలోకి తీసుకోకండి. సెలెక్షన్ సమయంలో అన్‌ఫిట్‌గా ఉన్న ప్లేయర్‌ను ఎలా తీసుకుంటారు?' అని కృష్ణమాచారి శ్రీకాంత్ నిలదీశాడు.
తను సెలెక్షన్ ప్యానెల్‌లో ఉండగా ఇలా జరిగిన ఘటనలను శ్రీకాంత్ గుర్తుచేసుకున్నాాడు. 'సౌతాఫ్రికాతో ఒక టెస్టు మ్యాచ్ ఆడేందుకు జట్టును ప్రకటించాల్సి వచ్చింది. అప్పటికి వీవీఎస్ లక్ష్మణ్ పూర్తి ఫిట్‌గా లేడు. దీంతో అతని స్థానంలో వృద్ధిమాన్ సాహాను తీసుకున్నాం. ఆ మ్యాచ్‌లో సాహా అరంగేట్రం చేశాడు' అని గుర్తుచేశాడు.