ఆసియా కప్ ఫైనలిస్టును నిర్ణయించే శ్రీలంక, పాకిస్తాన్ మ్యాచులో చాలా మంది ఫ్యాన్స్‌కు ఒక కన్ఫ్యూజన్ కలిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఆరంభం నుంచే తడబడింది. అయితే చివర్లో మహమ్మద్ రిజ్వాన్ (82 నాటౌట్) అద్భుతంగా ఆడాడు. అతనికి ఇఫ్తికర్ అహ్మద్ (47) మంచి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారు.
వర్షం వల్ల 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచులో రిజ్వాన్, ఇఫ్తికర్ అద్భుతమైన భాగస్వామ్యంలో పాకిస్తాన్ 252/7 పరుగుల స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక కూడా తడబడిందనే చెప్పాలి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఓపెనర్లు కుశాల్ పెరీరా (17), పాథుమ్ నిస్సంక (29) పెద్దగా రాణించలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన ముగ్గురు బ్యాటర్లూ మంచి పట్టుదల కనబరిచారు.

ముఖ్యంగా కుశాల్ మెండిస్ (91) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సదీర్ సమరవిక్రమ (48) కూడా ఆకట్టుకోగా.. చరిత్ ఆశలంక (49 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే శ్రీలంక జట్టు కూడా నిర్ణీత 42 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 252 పరుగులే చేయడం గమనార్హం. ఇది చూసిన చాలా మంది రెండు జట్లు ఒకే స్కోరు చేస్తే మ్యాచ్ డ్రా అయ్యి సూపర్ ఓవర్‌కు వెళ్లాలి కదా అనుకున్నారు.
సూపర్ ఓవర్‌కు వెళ్తే పాకిస్తాన్ గెలుపు ఖాయమని అంతా భావించారు. కానీ అదే స్కోరు చేసినా కూడా రెండు వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే ఇది డీఎల్ఎస్ విధానం ద్వారా లంకకు నిర్దేశించిన లక్ష్యం కావడం గమనార్హం. ఈ మ్యాచ్ ఆరంభం వర్షం వల్ల ఆలస్యమైన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు.
అయితే పాకిస్తాన్ బ్యాటింగ్ సమయంలో మరోసారి వర్షం పడింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది. దీంతో శ్రీలంక లక్ష్యాన్ని డీఎల్ఎస్ విధానంలో 252గా నిర్దేశించారు. సాధారణంగా అయితే పాక్ స్కోరు కూడా అదే కాబట్టి.. లంక 253 పరుగులు చేస్తే గెలిచేది. లేదంటే మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లాల్సింది. కానీ డీఎల్ఎస్ విధానం వల్ల మ్యాచ్ శ్రీలంక సొంతమైంది.
ఇలా వర్షం ఆటంకం కలిగించడం వల్లనే మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా వర్షం పడటంతో డీఎల్ఎస్ విధానంలో లంక టార్గెట్‌ను 252గా అంపైర్లు నిర్దేశించారు. దీన్ని ఛేదించిన లంక.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసియా కప్ ఫైనల్‌లో అడుగు పెట్టింది. ఈ టోర్నీ ఫైనల్ చేరడం లంకేయులకు ఇది 11వ సారి కావడం గమనార్హం. దీంతో ఫైనల్‌లో భారత్, పాక్ మ్యాచ్ చూడాలని అనుకున్న ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు.