ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ షాకింగ్ విషయం చెప్పాడు. ఈ టోర్నీలో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఆడటంపై అప్‌డేట్ ఇచ్చాడు. రాహుల్ ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాడని చెప్పిన ద్రావిడ్.. కానీ ఆసియా కప్‌లో భారత్ ఆడే తొలి రెండు మ్యాచుల్లో అతను ఆడలేడని స్పష్టం చేశాడు. ఈ మ్యాచులు ఆడేందుకు రాహుల్ ఇంకా ఫిట్‌గా లేడని వెల్లడించాడు.
పాకిస్తాన్‌తో హైఓల్టేజ్ మ్యాచ్ కోసం భారత్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో రాహుల్ వంటి కీలకమైన మిడిలార్డర్ బ్యాటర్ జట్టుకు దూరమవడం టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఐపీఎల్ సమయంలో గాయపడిన రాహుల్.. శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్సీయేలో చేరిన అతను పూర్తిగా కోలుకున్నాడని వార్తలొచ్చాయి.

కానీ ఆ తర్వాత మరో చిన్న గాయంతో రాహుల్ ఇబ్బంది పడుతున్నట్లు ఆసియా కప్ జట్టును ప్రకటించినప్పుడే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. అయితే తొలి మ్యాచ్ సమయానికి అతను ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉందన్నాడు. ఇప్పుడు అది కుదరదని తేలిపోయింది. ఆసియా కప్ కోసం శ్రీలంకకు బయలుదేరే ముందు రాహుల్ ద్రావిడ్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రాహుల్ గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు.
రాహుల్ పూర్తిగా కోలుకోలేదని.. కాబట్టి పాకిస్తాన్, నేపాల్‌తో జరిగే గ్రూప్ దశ మ్యాచుల్లో అతను ఆడటం కుదరదని ద్రావిడ్ ప్రకటించాడు. అయితే అతని స్థానంలో శాంసన్, కిషన్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది. ట్రావెలింగ్ రిజర్వ్‌గా జట్టుతో చేరిన శాంసన్‌కు ఈ టోర్నీలో అవకాశం దక్కడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇషాన్ కిషన్‌కే టీం మేనేజ్‌మెంట్ ఓటు వేసే అవకాశం ఉంది.

ఆసియా కప్ కోసం ఆలూర్‌లో నిర్వహించిన ప్రిపరేటరీ క్యాంప్‌లో రాహుల్ చక్కగా పాల్గొన్నాడు. బాగానే బ్యాటింగ్ చేసిన అతను.. వికెట్ కీపింగ్‌లో కూడా చురుగ్గా కదిలాడు. దీంతో ఆసియా కప్‌లో రాహుల్ ఆడటం ఖాయమని చాలా మంది అనుకున్నారు. అయితే అతని విషయంలో రిస్క్ తీసుకోవడానికి టీం మేనేజ్‌మెంట్ సిద్ధంగా లేదు. అందుకే అతనికి ఆసియా కప్ మొదటి రెండు మ్యాచులకు విశ్రాంతి ఇచ్చినట్లు సమాచారం.