వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా కీలక ప్లేయర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. గతేడాది ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ రెండింట్లో కోహ్లీ అద్భుతమైన క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లో కూడా అతని నుంచి ఫ్యాన్స్ అదే ఆశిస్తున్నారు. ఒత్తిడిలో చెలరేగే కోహ్లీ ఈసారి కూడా రాణిస్తాడని అంతా అనుకుంటున్నారు. ఈ క్రమంలో కోహ్లీ గురించి తన బెస్ట్ ఫ్రెండ్, సఫారీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర విషయాలు చెప్పాడు.
కోచ్‌లు, టీంమేట్స్ నుంచి ముఖ్యమైన విషయాలను కోహ్లీ నేర్చుకుంటాడని, అలా తన ఆటను మెరుగు పరుచుకుంటాడని డివిలియర్స్ అన్నాడు. 'వయసు పెరిగేకొద్దీ అందరూ మెచ్యూర్ అవుతారు. ఇలా ఎదిగేకొద్దీ అనుభవం ఉన్న ఆటగాళ్ల నుంచి మనం చాలా నేర్చుకుంటాం. వాళ్లు కేవలం మన ప్రత్యర్థులే కాదని, చాలా మంచి వ్యక్తులని తెలుసుకుంటాం' అని డివిలియర్స్ అన్నాడు.

'విరాట్ చాలా తెలివైన వాడు. కోచ్‌లు, టీంమేట్స్ నుంచి తను చాలా విషయాలు పట్టేశాడు. ఆర్సీబీలో కోహ్లీ కుర్రాడుగా ఉన్నప్పుడు, తనపై మార్క్ బౌచర్ చాలా ప్రభావం చూపాడు. నేను కూడా ఒక ఫ్రెండ్‌లా ఇన్‌ఫ్లుయెన్స్ చేశానని అనుకుంటున్నా. తనకు సెట్ అయ్యే కరెక్ట్ బ్యాలెన్స్‌ను కోహ్లీ కనుక్కున్నాడు. వరల్డ్ కప్‌లో టీమిండియా తరఫున అతను స్పెషల్ ఇన్నింగ్సులు ఆడతాడు. అవి చూసేందుకు ఎదురు చూస్తున్నా' అని డివిలియర్స్ జోస్యం చెప్పాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో కోహ్లీ ఇంకా తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వలేదు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ ఇన్‌సైడ్ ఎడ్జ్ వల్ల అతను కేవలం నాలుగు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇక నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశమే కోహ్లీకి రాలేదు. ఇక మళ్లీ పాకిస్తాన్‌తో జరిగే సూపర్-4 మ్యాచ్‌లో అతను బరిలో దిగే అవకాశం ఉంది. ఇక ఆ మ్యాచ్‌లో కోహ్లీ ఎలా రాణిస్తాడో చూడాలి.