1. దసున్ షనక సారథ్యం,
శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా పేస్ ఆల్రౌండర్ దసున్ షనక చాలా పరిణతితో వ్యవహరిస్తున్నాడు. 31ఏళ్ల దసున్ సారథ్యంలో జట్టులోని ప్లేయర్లు ఫ్రీగా ఆడగలుగుతున్నారు. షనక ఆల్రౌండర్ కావడం మూలంగా.. మ్యాచ్ పరిస్థితిని అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో తన కోణంలో అర్థం చేసుకుని మసులుకునేవాడు. అలాగే బౌలర్ల ప్రయోగాల్లోనూ అతను దిట్ట. తనతో పాటు మొత్తం శ్రీలంకకు 6 బౌలింగ్ ఆప్షన్లు ఉండేలా ప్రతి మ్యాచ్ చూసుకున్నాడు. తీక్షణ, హసరంగాల్లో ఒకరిని పవర్ ప్లేలో ఒకట్రెండు ఓవర్లు ప్రయోగించడం అలాగే.. మరొకరిని మిడిలార్డర్లో వాడుకోవడం దసున్ స్పెషలాలిటీ, ప్రమోద్, మధుశంక లాంటి కుర్రాళ్లపై విశ్వాసం చూపడం, అలాగే బ్యాటింగ్లో రాజపక్సతో కలిసి చివర్లో మంచి భాగస్వామ్యాలు నమోదు చేసే బాధ్యతను తీసుకోవడం దసున్ చేసేవాడు. ఇక మ్యాచ్ ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో ఆటోమేటిక్‌గా తమ వ్యూహం ఇది అని ప్రత్యర్థి జట్లకు పరోక్షంగా హెచ్చరికలు చేయడం కూడా దసున్ లక్షణం. అతని సారథ్యంలో శ్రీలంక మళ్లీ పునర్వైభవాన్ని సంతరించుకుందనే చెప్పాలి.
2. కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ వ్యూహాలు
ఇంగ్లాండ్ కోచ్‌గా యాషెస్ టెస్ట్ సిరీస్ పరాజయం తర్వాత వైదొలిగిన క్రిస్ సిల్వర్ వుడ్ తన కోచ్ నైపుణ్యాలేంటో నిరూపించుకున్నాడు. సిల్వర్ వుడ్ రాకముందు శ్రీలంక జట్టులో ఎన్నో లుకలుకలు ఉన్నాయి. ఫామ్ కోల్పోయిన వాళ్లకు, టెస్టులకు సరిపోయే ప్లేయర్లకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో స్థానాలు దక్కేవి. అయితే అతనొచ్చాక జట్టులో సమూల మార్పులు కన్పించాయి. స్పెషలిస్టు వైట్ బాల్ ఫార్మాట్ టీం తయారైంది. ప్రతి ఒక్కరి రోల్ ఏంటో కచ్చితంగా తెలుసుకునేలా అతను ప్లేయర్లను నడిపించాడు. శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్లోనూ కీలక మార్పులు చేసుకున్నాయి. కుశాల్, పాతుమ్ నిస్సాంక ఓపెనింగ్, షనక, రాజపక్స ఫినిషింగ్ అనేది అతని వ్యూహం, బౌలింగ్లో ప్రమోద్, దిల్షాన్, కరుణరత్నే, హసరంగా, తీక్షణ దాదాపు సెట్టయ్యేలా చేశాడు. జట్టులో పెద్ద పెద్ద మార్పులు జరగకుండా ఓ ఫిక్స్‌డ్ జట్టును తయారు చేశాడు. ప్రతి ప్లేయర్ రోల్ ఏంటో కచ్చితంగా తెలిసేలా చేశాడు. ఫలితంగా శ్రీలంక జట్టు విజయ పరంపర కొనసాగించింది.
3. పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ ఓపెనింగ్
ఆసియాకప్ టోర్నీలో శ్రీలంక విజేతగా నిలవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. ఆ జట్టు ఓపెనింగ్ జోడీ పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్. వీరిద్దరు మంచి స్టాండ్ ఇచ్చారు. ఈ టోర్నీలో నిస్సాంక 6 మ్యాచ్‌ల్లో 173పరుగులు చేయగా, కుశాల్ మెండిస్ 155పరుగులు చేశాడు. నిస్సాంక కాస్త వికెట్ కాపాడుతూ ఆడగా.. మెండిస్ ధాటిగా ఆడేవాడు. దీంతో స్కోరు వేగంగా కదిలేది. ఇండియాపై వీరిద్దరు తలా హాఫ్ సెంచరీ చేయడం తెలిసిందే. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసినవారిలో వీరు వరుసగా 5, 6 స్థానాల్లో ఉన్నారు. వీరు జట్టుకు మంచి శుభారంభం అందించడం, బౌలర్ల లయను దెబ్బతీసేలా రాణించడంతో తర్వాత వచ్చే బ్యాటర్లు పుంజుకోవడానికి, స్వేచ్చగా ఆడేందుకు వీలయ్యేది
4. రాజపక్స ఫినిషింగ్
ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణగా నిలిచిన బ్యాటర్ ఎవరంటే కచ్చితంగా భానుక రాజపక్స అనే చెప్పాలి. అతను జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ గట్టెక్కించే ఇన్నింగ్స్ ఆడాడు. తనకు తోడుగా ఒకరిద్దరితో భాగస్వామ్యాలు నమోదు చేస్తూ జట్టును పటిష్ఠ స్థితికి చేర్చాడు. బంగ్లాదేశ్‌తో మినహా మిగతా అన్ని జట్లపై ఆడాడు. ఈ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో రాజపక్స స్కోర్లు చూస్తే..
1. ఆఫ్ఘన్‌పై (38పరుగులు 29బంతుల్లో), 2.బంగ్లాపై (2పరుగులు), 3.ఛేజింగ్ టైంలో 6వ స్థానంలో (31పరుగులు 14బంతుల్లో), 4.ఇండియాపై (25పరుగులు 17 బంతుల్లో), 5.పాకిస్థాన్‌పై సూపర్ 4దశలో జట్టు 29పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు (24పరుగులు 19బంతుల్లో), 6. ఫైనల్లో పాకిస్థాన్‌పై 36పరుగులకే జట్టు 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు (71పరుగులు 45బంతుల్లో) రాణించాడు. నంబర్ 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ దిగే అతను 149 స్ట్రైక్ రేటుతో 191పరుగులు చేశాడు. శ్రీలంక తరఫున ఈ టోర్నీలో అత్యధిక పరుగులు అతనివే. ఫైనల్లో అతని ఇన్నింగ్స్ శ్రీలంక క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.
5. హసరంగా అండ్ కో బౌలర్లు
శ్రీలంక ప్రధాన బౌలింగ్ అస్త్రం హసరంగా ఈ టోర్నీలో తన ఆల్రౌండ్ స్కిల్స్‌తో అదరగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో 9వికెట్లు తీసిన హసరంగా.. ఫైనల్లో కీలక 36పరుగులు చేశాడు. అంతకుముందు పలు మ్యాచ్‌ల్లోనూ చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. అతనికి తోడు శ్రీలంక బౌలర్లు ఈ టోర్నీలో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. తీక్షణ (6వికెట్లు 6.75ఎకానమీ), కరుణరత్నే (7వికెట్లు), ప్రమోద్ మధుశన్ (6వికెట్లు), దిల్షాన్ మధుశంక (6) వికెట్లతో రాణించారు. ఇక అప్పుడప్పుడు దసున్ షనక, అలాగే ధనుంజయ డిసిల్వా కూడా బౌలింగ్లో కొద్దో గొప్పో సాయం చేశారు. 6, 7 బౌలింగ్ ఆప్షన్లు ఉండడం శ్రీలంకకు బిగ్ ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి.

ఫైనల్లో 23పరుగు తేడాతో శ్రీలంక విజయం
పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో హసరంగా(36, 3/27) ఆల్‌రౌండ్ ప్రదర్శనకు తోడు భానుక రాజపక్స(71 నాటౌట్) వీరోచిత పోరాటంతో 23పరుగుల తేడాతో శ్రీలంక పాక్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్లకు 170 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ రిజ్వాన్(49 బంతుల్లో 55), ఇఫ్తికర్ అహ్మద్(31బంతుల్లో 32) తప్పా మిగిలినవారు తుస్సుమనిపించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రాజపక్స నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా వనిందు హసరంగా నిలిచాడు.


Click it and Unblock the Notifications












