
షార్జాలో..
గ్రూప్-ఏలో ఇవ్వాళ బాబర్ ఆజమ్ నాయకత్వాన్ని వహిస్తోన్న పాకిస్తాన్.. హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు గెలుపురుచి చూడని జట్లే ఈ రెండు కూడా. యూఏఈలోని షార్జా స్టేడియంలో మ్యాచ్ షెడ్యూల్ అయింది. భారత కాలమానం ప్రకారం- సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. పసికూనపై భారత్ ఇదివరకే తన ప్రతాపాన్ని చూపింది. ఇక పాకిస్తాన్ వంతు వచ్చింది.

బ్యాటింగ్ లైనప్..
దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోయినప్పటికీ- హాంకాంగ్ పోరాట పటిమను ప్రదర్శించింది. మెరికల్లాంటి భారత బౌలింగ్‌కు ధీటుగా స్పందించింది. 20 ఓవర్లల్లో 152 పరుగులు చేసింది. ఈ క్రమంలో అయిదు వికెట్లను మాత్రమే కోల్పోయిందంటే- హాంకాంగ్ బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్నట్టే. శక్తిమంతమైన టీమిండియా బౌలర్లపై ఎదురుదాడి చేసి- ఓవర్‌కు ఏడుకు పైగా పరుగులు చొప్పున రాబట్టుకుంది. టీ20 స్పెషలిస్ట్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్‌ల బౌలింగ్‌లో 97 పరుగులు పిండుకుంది.

పాక్‌తో హాంకాంగ్..
ఇవ్వాళ పాకిస్తాన్‌తో ఆడబోతోంది. భారత్‌తో పోల్చుకుంటే పాకిస్తాన్ బౌలింగ్ కాస్త బలహీనమే. షహీన్‌షా అఫ్రిది గాయం నుంచి తప్పుకోవడం బాబర్ టీమ్‌కు అతిపెద్ద మైనస్ పాయింట్. ఈ పరిస్థితుల మధ్య హాంకాంగ్.. పాకిస్తాన్‌పై ఎలా విజృంభించబోతోందనేది ఆసక్తికరమే. టీమిండియాపై ఆడినట్లుగా పాకిస్తాన్‌పైనా హాంకాంగ్ చెలరేగితే మ్యాచ్ రసవత్తరంగా ఉంటుంది. సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెడుతుంది.

బోణీ కొట్టని పాక్..
ఈ ఏడాదిలో పాకిస్తాన్ ఇప్పటివరకు టీ20 మ్యాచ్‌లల్లో బోణీ కొట్టలేదు. ఆస్ట్రేలియా, భారత్ చేతుల్లో ఆడిన మ్యాచ్‌లల్లో పరాజయాన్ని చవి చూసింది. ఆ కొరతను హాంకాంగ్‌పై తీర్చుకునే అవకాశాలు లేకపోలేదు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ గతి తప్పింది. బాబర్ ఆజమ్, ఫకర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు.. భారీ స్కోర్ చేయలేకపోయారు. మహ్మద్ రిజ్వాన్ ఒక్కడే ఫర్వాలేదనిపించుకున్నాడు. హాంకాంగ్‌పై పరుగుల వరద పారించవచ్చు.

పాకిస్తాన్ తుదిజట్టులో
పాకిస్తాన్ తుదిజట్టులో- బాబర్ ఆజమ్ (కేప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫకర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, మహమ్మద్ హొస్నయిన్, హ్యారిస్ రవూఫ్, షానవాజ్ దహాని ఆడే అవకాశాలు ఉన్నాయి. హాంకాంగ్ ప్లేయింగ్ 11లో- నిజాకత్ ఖాన్ (కేప్టెన్), యాసిమ్ ముర్తాజా, బాబర్ హయాత్, కించిత్ షా, ఐజాజ్ ఖాన్, జీషన్ అలీ, స్కాట్ మెక్‌కెచ్ని (వికెట్ కీపర్), హరూన్ అర్షద్, ఎహ్‌సాన్ ఖాన్, ఆయుష్ శుక, మహ్మద్ ఘజన్ఫర్ ఆడొచ్చు.


Click it and Unblock the Notifications
