
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఆసియా కప్ - 2022 విజేతగా పాకిస్థాన్ నిలుస్తుందని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సమీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇకపోతే బాబర్ ఆజాం కెప్టెన్సీలో పాక్ నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రోహిత్ శర్మ సారథ్యంలోని ఇండియాను ఎదుర్కోబోతుంది. ఇక పాకిస్థాన్ జట్టు ఆత్మవిశ్వాసం ఓ రేంజులో ఉందని అందువల్ల భారత్‌పై పాక్‌దే పైచేయి అవుతుందని పేర్కొన్నాడు.
క్రికెట్ పాకిస్థాన్ మీడియాతో మాట్లాడిన సమీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆసియా కప్ టోర్నీలో మహ్మద్ నబీ సారథ్యంలోని ఆఫ్ఘనిస్తాన్ జట్టు అత్యుత్తమ స్పిన్ ఎటాక్‌ను కలిగి ఉందని పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్థాన్ తరఫున రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ లాంటి నిఖార్సైన స్పిన్నర్లు ఉన్న సంగతి తెలిసిందే.
అలాగే భారత్ స్పిన్ అటాక్ కూడా చాలా బాగుందని, ఆ జట్టులో ఎడమచేతి స్పిన్నర్ రవీంద్ర జడేజా, ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, మణికట్టు స్పిన్నర్ చాహల్ ఉన్నారని పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ రషీద్ ఖాన్ లాంటి స్టార్‌ను ఉండడం ఆ జట్టుకు ఎనలేని ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. యూఏఈ పరిస్థితులలో అత్యుత్తమ స్పిన్ దాడి ఉన్న జట్టు మాత్రం ఆఫ్ఘనిస్థానే అని సమీ చెప్పాడు.
ఈ టోర్నీలో పాకిస్థాన్ తమ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది సేవలను కోల్పోతుందని కూడా సమీ అభిప్రాయపడ్డాడు. 'పాకిస్థాన్ షాహీన్ పేస్ సేవలను కోల్పోతుంది, కానీ పాక్ జట్టు ప్రస్తుతం విజయ పరంపరలో ఉంది. కాబట్టి ఆ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. అలాగే యూఏఈ పరిస్థితులు బాబర్ ఆజామ్ సేనకే అనుకూలంగా ఉన్నాయి.
అందువల్ల భారత్‌ను పాక్ ఓడించడం దాదాపు ఖాయమని తెలుస్తోంది' అని సమీ తెలిపాడు. మోకాలి గాయం కారణంగా షాహీన్ ఆఫ్రిది పాక్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. షాహీన్‌తో పాటు మహ్మద్ వసీం జూనియర్ కూడా గాయం కారణంగా ఆసియా కప్ నుంచి దూరమయ్యాడు. పాకిస్థాన్ బ్యాటింగ్ పరంగా గట్టిగానే ఉన్నా..బౌలింగ్ కాస్త వీక్‌గా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇకపోతే ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7.30కు ప్రారంభం కానుంది.