
న్యూ ఢిల్లీ: దక్షిణాసియాలో ఇప్పటికే ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యప్ టీవీ తాజాగా మరో అవకాశాన్ని దక్కించుకుంది. ఇంటర్‌నెట్ ఆధారిత టీవీ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ యప్ టీవీ.. ఆసియాకప్-2018 టోర్నీ ప్రత్యేక డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో పాటు యూరప్‌లోని అన్నిదేశాల్లో ఈ టోర్నీ మ్యాచ్‌ల ప్రసారాలను యప్‌టీవీలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
తాజాగా జరిగిన ఒప్పందం గురించి సంస్థ సీఈవో ఉదయ్ రెడ్డి ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. 'ఈ ఒప్పందం కుదుర్చుకున్నందుకు మేం చాలా సంతోషిస్తున్నాం. ఆసియా కప్ టోర్నమెంట్‌ను యప్ టీవీ ప్లాట్ ఫాం ప్రసారం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. క్రికెట్‌కు సాధారణంగానే ఈ ప్రాంతంలో ఎక్కువగా అభిమానిస్తుంటారు. పైగా ఈ ప్రసారాలను సులువుగా యాక్సెస్ చేసే విధానంలో రూపొందిస్తున్నారు. మా వినియోగదారులంతా దీనిపట్ల సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం.' పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆసియా కప్ 2018 యునైటెడ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్, అబుదాబి వేదికగా జరుగుతున్నాయి. మ్యాచ్ చూడాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యప్‌టీవీ.కామ్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఇంతేకాకుండా మొబైల్ వినియోగదారులు యప్ టీవీ యాప్ ద్వారా కూడా మ్యాచ్‌లు చూడవచ్చు. పాకిస్తాన్, భారత్, శ్రీలంక, అప్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్‌ల మధ్య జరుగుతున్న ఈ మెగాటోర్నీ సెప్టెంబర్ 28న ముగియనుంది.
సిరీస్‌లో భాగంగా జరగనున్న 13 మ్యాచ్‌లలో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ముగిశాయి. ఇందులో శ్రీలంక జట్టు రెండు మ్యాచ్‌లలోనూ ఓటమిని ఎదుర్కొని టోర్నీ నుంచి వైదొలగింది. ఈ 4 మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, ఇండియా విజేతలుగా నిలిచాయి. హాంకాంగ్ జట్టు పాకిస్తాన్‌తో మొదటి మ్యాచ్‌ను ఓడి భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. స్వల్ప వ్యత్యాసమైన 26పరుగులతో టీమిండియా విజయం సాధించింది.