
హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు ఇంగ్లాండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే మరికొద్ది రోజుల్లోనే జరగబోయే ఆసియా కప్ కనువిందు చేయనుంది. యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ 2018పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రత్యేకంగా ఈ నెల 19న జరగబోయే భారత్-పాకిస్తాన్‌ల మ్యాచ్‌పైనే అందరీ దృష్టి కాపాడుతున్నాయి.
చాలా కాలం తర్వాత చాంపియన్ ట్రోఫీ అనంతరం దాయాదుల పోరును అభిమానులు ఆసియాకప్‌లో చూడనున్నారు. ఈ టోర్నీకి కోహ్లీ అందుబాటులో ఉండకపోవడంతో కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాద్యతలు చేపట్టనున్నాడు. కొత్త వ్యూహాలతో బరిలోకి దిగనున్న రోహిత్ సేనకు పాక్ స్టార్ ఆటగాడు షోయాబ్ మాలిక్ రూపంలో ఇబ్బందులు తప్పవంటున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్.
ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో అత్యంత సీనియర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మాలిక్ ఆ జట్టుకు కీలకం కానున్నాడని ఈ దిగ్గజ ఆటగాడు అభిప్రాయపడ్డాడు. 'మిడిల్ ఓవర్లలో రోహిత్ శర్మ ఖచ్చితంగా స్పిన్నర్లతో అటాకింగ్ చేయిస్తాడు. కానీ స్ట్రైక్ రోటేట్ చేయడం, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం మాలిక్‌కు సులువైన పని. ప్రత్యేకంగా టీమిండియా అంటే అతడు చెలరేగి ఆడతాడని గత రికార్డులే పేర్కొంటున్నాయి. కుల్దీప్, చాహల్ వంటి మణికట్టు స్పిన్నర్లు ఉన్నప్పటికీ.. మాలిక్ కోసం ప్రత్యేక వ్యూహాలు రచించాలి. ఫఖర్ జామన్, బాబర్ అజామ్ వంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉండటం పాక్‌కు బలం' అంటూ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మన్ పేర్కొన్నాడు.
సెప్టెంబర్ 18 నుంచి హాంగ్‌కాంగ్‌తో జరిగే తొలి మ్యాచ్ 16 మంది సభ్యులతో కూడిన జట్టులో భాగమైంది. ఈ టోర్నీకి వేదికలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్, అబు దాబిలు కానున్నాయి. టోర్నమెంట్‌లో ఉన్న గ్రూపులు రెండు ఏ, బీ. ఇందులో గ్రూపు ఏ కు సంబంధించి ఇండియా, పాకిస్తాన్, హాంగ్‌కాంగ్ . గ్రూపు బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్‌లు ఉన్నాయి. కాగా, భారత్ ఈ టోర్నీలో ఆరు సార్లు టైటిల్ గెలుచుకోగా, శ్రీలంక ఐదు సార్లు విజేతగా నిలిచింది. భారత్ విజేతగా నిలిచిన ఆరింటిలో మూడు సార్లు ఫైనల్ పోరులో శ్రీలంకతోనే పోరాడటం గమనార్హం.