
హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా మరికొద్ది గంటల్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కి వేదిక కానుంది. భారత్-పాక్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఎగబడుతున్నారు.
ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోన్న దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉన్న 25వేల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైన కొద్ది రోజులకే ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లు అన్ని అమ్ముడైనట్లు అధికారులు చెప్పారు.
ఈ మ్యాచ్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు కూడా టికెట్ల రేట్లను అమాంతం పెంచేశారు. అయినా సరే క్రికెట్ అభిమానులు మ్యాచ్ టికెట్లను కొనుగోలు చేశారంటే అర్ధమవుతుంది. కాగా, ప్రస్తుతం దుబాయ్‌లో విపరీతమైన ఎండలు దంచుతున్నాయి.
దీంతో ఆటగాళ్లు సైతం ఐస్ క్యూబ్‌లతో సేద తీరుతున్నారు. ఈ మ్యాచ్‌తో పాటు టోర్నీలో అన్ని అనుకూలిస్తే మరో రెండు మ్యాచ్‌ల్లో భారత్-పాక్‌లు తలపడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గ్రూప్-ఏలో టాపర్‌గా నిలవాలని ఇరు జట్లు ఊవిళ్లూరుతున్నాయి.
భారత్, పాక్ మధ్య మరో మ్యాచ్ సూపర్ ఫోర్ స్టేజ్‌లో జరిగే అవకాశం ఉంది. ఆ మ్యాచ్ ఈనెల 23న ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సూపర్ ఫోర్ స్టేజిలో తమ ప్రత్యర్ధి జట్లపై విజయం సాధించి ఫైనల్‌కు వెళితే... ఇరు జట్లు మరోసారి తలపడే అవకాశం ఉంది.
ఈ టోర్నీలో రెండు జట్ల మధ్య ఎన్ని మ్యాచ్‌లు జరిగినా ఆ మ్యాచ్‌లకు సంబంధించిన అన్ని టికెట్లు అమ్ముడుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉంటే మంగళవారం జరిగే భారత్-పాక్ మ్యాచ్‌కి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరుకానున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇమ్రాన్ ఖాన్ తన రెండు రోజులు పర్యటన నిమిత్తం మంగళవారం సౌదీ అరేబియాకు బయల్దేరారు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా దాయాది దేశాల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆయన దుబాయి వెళ్లనున్నారని సమాచారం. అయితే, దుబాయి స్పోర్ట్స్ సిటీ అధికారులు మాత్రం ఇమ్రాన్ ఖాన్ హాజరుపై సమాచారం లేదని వెల్లడించారు.