
హైదరాబాద్: టీమిండియాలో మిడిలార్డర్ ఇంకా కుదురుకోలేదని ఆసియా కప్‌లో తమ లక్ష్యం నాలుగు, ఆరు స్థానాల్లో ఆడగలవారిని గుర్తించడమే అని తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మిడిలార్డర్ లోపంతోనే ఇంగ్లాండ్‌లో కోహ్లీసేన ఓడిన సంగతి తెలిసిందే. ఆసియా టోర్నీలో భాగంగా భారత్ మంగళవారం పసికూన హాంకాంగ్‌తో తలపడనుంది. మనీశ్ పాండే, కేదార్ జాదవ్, అంబటి రాయుడు మిడిలార్డర్‌లో చోటు కోసం పోరాడుతున్నారు.
'బౌలర్ల రొటేషన్ గురించి ఆలోచించడం లేదు. విభిన్న పరిస్థితుల్లో ఒక్కొక్కరు ఎలా స్పందిస్తారో పరిశీలించాలని అనుకుంటున్నా. నిలకడగా ఉన్నవారికి చాలినన్ని అవకాశాలు ఇస్తాం. ఆటగాళ్ల స్పందనను బట్టి నిర్ణయాలు తీసుకుంటాం. ఎడమచేతి వాటం స్పెషలిస్టు సేనెవిరత్నె సహాయక బృందంలోకి రావడం సంతోషం. రాబోయే సిరీసుల్లో మేం ఎడమచేతి వాటం బౌలర్లను ఎదుర్కోవాల్సి ఉంది.'
'లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్‌ను తీసుకోవడం మంచి నిర్ణయం. దుబాయ్ వికెట్ బాగుంది. ఆట సాగుతున్న కొద్దీ వికెట్ మందకొడిగా మారుతుంది. ఇంగ్లాండ్ వాతావరణానికి అలవాటు పడి ఇక్కడికొచ్చిన వారికి కాస్త కష్టమే. ప్రతి ప్రత్యర్థిని మేం ఒకేలా చూస్తాం. ఆసియాకప్ పెద్ద టోర్నీ. నేను కాస్త ఆత్రుతతో, ఆందోళనతో ఉన్నాను. కుర్రాళ్లంతా బాగున్నారు' అని రోహిత్ అన్నాడు.
'ఆటగాళ్ల కోసం 3, 4, 6 స్థానాలు ఎదురుచూస్తున్నాయి. కేదార్, మనీశ్, రాయుడికి కోసం ఇవి వేచి చూస్తున్నాయి ఈ సిరీస్‌లో వారికి కావాల్సినన్ని అవకాశాలు ఇస్తాం. ఆసియాకప్ టోర్నీలోనే 4, 6 స్థానాల్లో ఆడే ఆటగాళ్లను గుర్తించాల్సి ఉంది. అంబటి రాయుడు, కేదార్ జాదవ్ ఇంతకు ముందు టీమిండియాలో ఆడినవాళ్లే. వారిద్దరూ పునరాగమనం చేసినందుకు సంతోషంగా ఉంది. వారు విజయాలు సాధించి పెడతారని ఆశిస్తున్నా' అని రోహిత్ అన్నాడు.