

హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా మరికొద్ది గంటల్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కి వేదిక కానుంది. భారత్-పాక్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఎగబడుతున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు.
ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు చెందిన రికార్డులను ఒక్కసారి పరిశీలిద్దాం. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 129 వన్డే మ్యాచ్‌లు జరగ్గా.... భారత్ 53 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో వైపు పాకిస్థాన్ మాత్రం మన కన్నా కాస్త మెరుగ్గా ఉంది. ఇందులో పాకిస్థాన్ మొత్తం 73 వన్డేల్లో విజయం సాధించింది.
ఇక, ఆసియా కప్ విషయానికి వస్తే ఇరు జట్లు 12 సార్లు తలపడగా... ఆరు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించిగా, పాకిస్థాన్ ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఒక మ్యాచ్ రద్దు అయింది. యూఏఈలో పాక్‌తో ఆడిన 26 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది ఏడుసార్లు మాత్రమే. యూఏఈలో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రం పాకిస్థాన్‌దే పైచేయిగా నిలిచింది.
యూఏఈ వేదికలో జరిగిన మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ 19 సార్లు విజయం సాధించింది. దీంతో యూఏఈలో పాకిస్థాన్‌ను ఓడించడం అంత సులభం కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. దీంతో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్ జట్టే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే, గత దశాబ్ధ కాలంలో రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో భారత జట్టే ఎక్కువ విజయాలను వరించింది.
గత పదేళ్లలో భారత్ ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పాకిస్థాన్ మాత్రం కేవలం 4 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తుంది. టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే చెరో మ్యాచ్ నెగ్గాయి. తొలి గ్రూప్ మ్యాచ్‌లో భారత్, పాక్ జట్లు హాంకాంగ్‌పై విజయం సాధించాయి.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గ్రూప్-ఏలో టాపర్‌గా నిలవాలని ఇరు జట్లు ఊవిళ్లూరుతున్నాయి. అయితే, పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత జట్టు కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.