
హైదరాబాద్: బౌలర్లు కూడా రక్షణ సామగ్రి ధరించే విధంగా అంటే ఫేస్‌మాస్క్‌లు ఉపయోగించేందుకు గాను బీసీసీఐ అనుమతించాలని టీమిండియా బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనాద్కత్‌లు కోరారు. ఈ మేరకు వీరిద్దరూ ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఇటీవల కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా దేశవాళీ టోర్నీ 'సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ' కోసం బెంగాల్ జట్టు సోమవారం ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 34 ఏళ్ల అశోక్ దిండా ఆఫ్ స్టంప్‌కి వెలుపగా ఫుల్‌టాస్ బంతిని విసరగా.. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ వివేక్ సింగ్ దానిని స్ట్రైట్‌గా ఆడాడు.
దీంతో బంతి నేరుగా వెళ్లి దిండా ముఖాన్ని తాకింది. ప్రథమ చికిత్స అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయానికి సిటీ స్కానింగ్ తీసి అనంతరం వైద్యులు దిండా పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ "ఫేస్‌మాస్క్‌ల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. క్రికెట్‌లో ఎన్నో సాంకేతిక మార్పులు చోటుచేసుకున్నా బౌలర్లు తరచూ గాయాలపాలవడం దురదృష్టకరం. దిండా నువ్వు కోలుకున్నావని అనుకుంటున్నా. దీనిపై నీ అభిప్రాయం ఏంటీ అశ్విన్ భాయ్" అంటూ ఉనాద్కత్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
దీంతో అశ్విన్ సైతం తన ట్విట్టర్‌లో వీటిని అరికట్టేందుకు ఐసీసీ చర్యలు చేపట్టాలని సూచించాడు. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొందరు అంపైర్లు, బౌలర్లు ఫేస్‌మాస్క్‌లు ధరించడాన్ని మనం చూస్తునే ఉన్నాం. న్యూజిలాండ్‌లోని ఒటాగోకు చెందిన స్పిన్నర్ వారెన్ బార్నెస్ ఫేస్‌మాస్క్ ధరించి బౌలింగ్ చేసే సంగతి తెలిసిందే.