విశాఖపట్నం: నగరంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వీసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా స్ఫిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన సత్తా చాటాడు. నాలుగు ఓవర్లు వేసి, నాలుగు వికెట్లు తీసి కెరీర్ లోనే ది బెస్ట్‌ను నమోదు చేశాడు.
ఈ నాలుగు ఓవర్లలో కూడా ఒక ఓవర్ మెడినే ఓవర్ కాగా, మిగిలిన మూడు ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలన్న ధోని నిర్ణయాన్ని అశ్విన్ వంద శాతం న్యాయం చేశాడు. దీంతో భారత్ రెండు వరుస విజయాలతో సిరిస్‌ను సొంతం చేసుకుంది.
ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌ను వేసిన అశ్విన్, మూడో బంతికే ఫామ్‌లో ఉన్న లంక బ్యాట్స్‌మెన్ నిరోశాన్ డిక్ వెల్లా(1)ను ఔట్ చేశాడు. ఇక చివరి బంతికి లంక దిగ్గజ బ్యాట్స్ మన్ తిలకరత్నె దిల్షాన్(1)ను ఔట్ చేశాడు. ఈ సిరిస్ ఫామ్‌లో ఉన్న వీరిద్దరూ సింగిల్ పరుగుకే వెనుదిరగడం విశేషం.

ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అశ్విన్ లంక కెప్టెన్ దినేశ్ చండీమాల్‌ను 8 పరుగుల వద్ద ఔట్ చేశాడు. ఆ తర్వాత తన మూడో (ఇన్నింగ్స్ ఐదో) ఓవర్ లోనూ అసేల గుణరత్నే(4)ను కూడా ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన తొలి నలుగురు లంక బ్యాట్స్‌మెన్ అశ్విన్ బౌలింగ్‌లో ఔట్ అవ్వడం విశేషం.
లంక టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ సిరిస్ అవార్డు కూడా దక్కింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా 2-1 తేడాతో భారత్ విజయం సాధించడంతో టీ20 ఫార్మాట్‌లో నెంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది.