హైదరాబాద్: విరామం లేకుండా అలసట ఎరగకుండా క్రికెట్ ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీలంక సిరీస్‌కు జట్టు ఎంపిక సమయంలో అతడి పనిభారం గురించి చర్చ జరిగనట్టు సమాచారం. శ్రీలంకతో సిరిస్‌లో కోహ్లీపై ఉన్న పని భారాన్ని తగ్గించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తోంది.
ఇందులో భాగంగా విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించి ప్రస్తుత వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియా వరుసగా సిరిస్‌లను ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక, కోహ్లీ విషయానికి వస్తే కివీస్‌తో వన్డే సిరిస్‌ను కలుపుకుంటే జూన్ నుంచి ఇప్పటివరకు 3 టెస్టులు, 23 వన్డేలు, 3 టీ20లు ఆడనున్నాడు.

ఈ నేపథ్యంలో జట్టులో రోటేషన్ పద్ధగతిలో బ్యాట్స్‌మెన్, బౌలర్లకు విశ్రాంతి కల్పించిన సంగతి తెలసిందే. ఇక, స్వదేశంలో శ్రీలంక సిరీస్ తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో సుదీర్ఘంగా పర్యటించనుంది.
ఈ నేపథ్యంలో సొంత గడ్డపై వరుస సిరీస్‌లు గెలిచిన టీమిండియా విదేశీ గడ్డపై అదరగొట్టాలంటే ఇప్పడు విశ్రాంతి లేకుండా ఆడుతున్న ఆటగాళ్లకు విశ్రాంతి నివ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఇక గత కొంతకాలంగా జట్టుకు దూరమైన సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు సైతం శ్రీలంకతో జరగబోయే సిరిస్‌కు ఎంపికయ్యే సూచనలు ఉన్నాయి.
ఇక, టెస్టు స్పెషలిస్టులు ఛతేశ్వర్ పుజారా, వృద్దిమాన్ సాహా, కేఎల్ రాహుల్, మురళీ విజయ్లు ఫిట్‌గా ఉంటే జట్టులోకి వస్తారు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడో స్పెషలిస్టు స్పిన్నర్‌గా ఎంపిక కావచ్చు. ప్రస్తుతం రంజీల్లో సత్తా చాటుతున్న మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ పేర్లను కూడా సెలక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఢిల్లీలో నవంబర్ 1న కివీస్‌తో జరిగే టీ20లో ఆశీష్ నెహ్రా రిటైర్ అయిన తర్వాత రెండు మ్యాచ్‌లకు బసిల్ థంపీ లేదా జయదేవ్ ఉనద్కత్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి విరామం లేకుండా ఆడుతున్న భువనేశ్వర్ కుమార్‌కు సైతం విశ్రాంతి కల్పించే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నారు.