
హైదరాబాద్: టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా శ్రీలంక మాజీ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్... అశ్విన్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు.
ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం అశ్వినే అత్యుత్తమ స్పిన్నర్ అని కితాబిచ్చాడు. నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో 300 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. దీంతో టెస్టుల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బౌలర్‌గా అశ్విన్ ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు.
ఈ సందర్భంగా అశ్విన్‌కు ముత్తయ్య అభినందనలు తెలిపాడు. 'అశ్విన్‌కు అభినందనలు తెలియజేస్తున్నా. 300 వికెట్లు తీయడం అంత సులువైన విషయం కాదు. కచ్చితంగా, ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో అతనే అత్యుత్తమ స్పిన్నర్' అని ముత్తయ్య మురళీధరన్ పీటీఐతో అన్నాడు.
'ప్రస్తుతానికి అతడు వన్డే జట్టులో లేనప్పటికీ, తిరిగి జట్టులో చోటు దక్కించుకుని పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కూడా అద్భుతాలు సృష్టిస్తాడని అనుకుంటున్నా' అని ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. శ్రీలంక తరుఫున 133 టెస్టులాడిన ముత్తయ్య 800 వికెట్లు తీసి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్ధానంలో ఉన్నాడు.
కాగా, అశ్విన్ కంటే ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం 30 మంది బౌలర్లు మాత్రమే 300కుపైగా వికెట్లు తీశారు. అయితే ఈ అరుదైన రికార్డుని అందుకోవడానికి అందరి కంటే తక్కువ టెస్టులు ఆడింది మాత్రం అశ్వినే కావడం విశేషం. రెండో టెస్టులో చివరి బ్యాట్స్‌మన్ గమాగె (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి అశ్విన్ రికార్డు నెలకొల్పాడు.
ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు 8 వికెట్ల దూరంలో ఉన్న అశ్విన్... తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ఈ రికార్డును సృష్టించాడు. గతంలో ఈ రికార్డు అస్ట్రేలియా పేస్ దిగ్గజం డెన్నిస్ లిల్లీ పేరిట ఉంది. డెన్నిస్ ఈ ఘనతను 56 మ్యాచుల్లో సాధించగా.. అశ్విన్ కేవలం 54 మ్యాచ్‌ల్లోనే సాధించడం విశేషం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.