దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టెస్టు ర్యాంకింగ్‌లో బౌలింగ్ విభాగంలో భారత్‌కు చెందిన రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించకున్నాడు. 2015 సంవత్సరానికి అతను నెంబర్ వన్ స్థానంతో వీడ్కోలు పలుకుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.
భారత బౌలర్లలో ఇప్పటి వరకు బిషన్ సింగ్ బేడీ మాత్రమే 1973లో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత అశ్విన్ ఆ మైలురాయిని చేరుకున్నాడు. దర్బన్, మెల్బోర్న్ టెస్టు మ్యాచులు ముగిసిన తర్వాత తాజా ఐసిసి ర్యాంక్స్ గురువారం వెలువడ్డాయి.
ఇంగ్లాండు రెండో ఇన్నింగ్సులో డేల్ స్మిత్ గాయపడి 3.5 ఓవర్ల కన్నా మించి బౌలింగ్ చేయలేని స్థితిలో నెంబర్ వన్ స్థానం అశ్విన్‌కు దక్కింది. తొలి ఇన్నింగ్సులో అతను నాలుగు వికెట్లు సాధించినప్పటికీ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.

స్టెయిన్ అశ్విన్ కన్నా నాలుగు పాయింట్లు ఎక్కువగా ఉన్న స్థితిలో దర్భన్ టెస్టు మ్యాచులో అడుగు పెట్టాడు. ఇప్పుడు ఆ పాయింట్ల మేరకే వెనకబడిపోయాడు. భారత బౌలర్లలో ఇంతకు ముందు బేడీ మాత్రమే నెంబర్ వన్ స్థానాన్ని పొందాడు. కెరీర్‌లో ఊపు మీద ఉన్నప్పుడు భగవత్ చంద్రశేఖర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నారు.
అశ్విన్ 2015లో 9 టెస్టు మ్యాచులు ఆడి 62 వికెట్లను సాధించడం ద్వారా 2015లో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. ఈ ఏడాది 15వ ర్యాంక్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన అశ్విన్ క్రమంగా అగ్రస్థానానికి ఎగబాకాడు. ముత్తయ్య మురళీథరన్ 2006 నుంచి 2008 వరకు మూడేళ్ల పాటు అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్టెయిన్ అగ్రస్థానంలోకి వచ్చాడు. 2013లో వెర్నోన్ ఫిలందర్ అగ్రస్థానానికి చేరుకోవడంతో స్టెయిన్ తన స్థానాన్ని కోల్పోయాడు.
నెంబర్ వన్ స్థానం తనకు దక్కడం పట్ల అశ్విన్ ఆనందం వ్యక్తం చేశాడు. బేడీ స్థాయికి చేరుకోవడం తనకు గర్వంగా ఉందని అన్నాడు. బేడీ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పాడు. తనపై తీవ్రమైన ప్రభావం వేసిన టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. ఇంగ్లాండుకు చెందిన స్టువర్ట్ బ్రాడ్ 14 టెస్టుల్లో 52 వికెట్లు తీసుకుని రెండో స్థానంలో నిలిచాడు.
టెస్ట్ ఆల్ రౌండర్లలో కూడా అశ్విన్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. గత మూడేళ్లలో అతను నెంబర్ వన్ స్థానాన్ని పొందడం ఇది రెండోసారి.