హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై విధించిన రెండేళ్ల నిషేధం ముగియడంతో 2018 ఐపీఎల్‌లో తిరిగి ఆడనున్నాయి. ఈ నేఫథ్యంలో గత వారం రోజులుగా చెన్నై జట్టుకి శుభాకాంక్షలు చెబుతూ ఆ ఫ్రాంచైజీ తరుపున ఆడిన ఆటగాళ్లు, అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సైతం 'తలా' అని రాసి ఉన్న 7వ నెంబరు పసుపు రంగు జెర్సీని ధరించి తనదైన స్టయిల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఘన స్వాగతం పలికాడు. తాజాగా రవిచంద్రన్ అశ్విన్ చెన్నై జట్టు పునరాగమనం పై చేసిన పోస్టు మిస్ ఫైర్ అయింది. దీంతో అశ్విన్‌పై అభిమానుల ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పునరాగమనంపై మాట్లాడాడు. 'రెండేళ్ల నిషేధాన్ని ముగించుకున్న చెన్నై జట్టు విలువ మరింత పెరిగింది. ఈ రెండేళ్ల సమయం మాకు ఎలా గడిచిందంటే 1958లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ సహా 23 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఆ విషాదం నుంచి మాంచెస్టర్ యునైటెడ్ జట్టు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. అలాగే ఈ రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై జట్టు బలంగా తిరిగి వస్తోంది' అని చెప్పిన అశ్విన్ తీవ్ర విమర్శల పాలయ్యాడు.
'ఫిక్సింగ్ కారణంగా నిషేధం ఎదుర్కొన్న జట్టును విమాన ప్రమాదంతో పోల్చుతున్నావ్, నువ్వేంటో అర్థమైంది. ఇలాంటి ప్రవర్తన వల్లే నీ ర్యాంకు మూడుకు పడిపోయింది చూసుకో అశ్విన్' అంటూ నితిన్ నాయక్ అనే నెటిజన్ ఎద్దేవా చేశాడు.
దీంతో వెంటనే స్పందించిన అశ్విన్ ట్వీట్ల ద్వారా వివరణ ఇచ్చాడు. 'ప్రమాదం కారణంగా మాంచెస్టర్ యునైటెడ్ జట్టు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఈ జట్టు రెండేళ్ల తర్వాత ఎంతో బలంగా పుంజుకుంది. రెండేళ్ల నిషేధం తర్వాత తమ జట్టు అలాంటి పరిస్థితే ఎదుర్కొందని చెప్పడానికే ప్రమాదం ఘటనపై మాట్లాడాను' అని అశ్విన్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.