
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ అదరగొట్టాడు. జడేజాతో కలిసి ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే అత్యంత వేగంగా 450 టెస్టు వికెట్లు తీసుకున్న భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. దీనిపై మాట్లాడిన టీమిండియా మాజీ లెజెండ్ ఇర్ఫాన్ పఠాన్.. అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అశ్విన్ కచ్చితంగా లెజెండ్ అని కొనియాడాడు.
'బుర్ర కంప్యూటర్‌లా పనిచేసే బౌలర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తను ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? అని అతని బుర్ర ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. బ్యాటర్లను ఇబ్బంది పెట్టడానికి కొత్తగా ఏదో ఒక ప్లాన్ వేస్తుంటుందా బుర్ర' అని ఇర్ఫాన్ పఠాన్ కొనియాడాడు. ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీని అశ్విన్ అవుట్ చేసిన విధానం అద్భుతం అని మెచ్చుకున్నాడు.
'అలెక్స్ క్యారీ అద్భుతంగా ఆడాడు. స్వీప్‌లు, రివర్స్ స్వీప్‌లతో ఆకట్టుకున్నాడు. ఆ భాగస్వామ్యాన్ని విడగొట్టడం చాలా ముఖ్యం. ఇక్కడ అశ్విన్ వేసిన ప్లాన్ ఒకటే.. క్యారీ స్వీప్ చేసినా, రివర్స్ స్వీప్ ఆడినా ఏం చేసినా సరే, తను మాత్రం ఫుల్‌లెంగ్త్ బంతులే వేయాలని నిర్ణయించుకున్నాడు' అని విశ్లేషించాడు. సాధారణంగా స్పిన్నర్లు ఇలాగే బౌలింగ్ చేస్తారని చెప్పిన పఠాన్.. 'షార్ట్ డెలివరీలు వేస్తే బ్యాటర్‌కు ఈజీగా రూమ్ దొరుకుతుంది. ఇక కమిన్స్ అయితే ఏం చెయ్యలేకపోయాడు. ముందు బంతిని టర్న్ చేసి బోల్తా కొట్టించాడు' అని మెచ్చుకున్నాడు.
అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని మెచ్చుకున్న పఠాన్.. అతను కచ్చితంగా భారత క్రికెట్‌లో లెజెండ్ స్థాయికి చేరుకున్నాడని తేల్చిచెప్పాడు. 'తను చాలా అనుభవం ఉన్న బౌలర్. ఇప్పుడు వేగంగా 450 వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడతను. ఈ లిస్టులో ముత్తయ్య మురళీధరన్, అనిల్ కుంబ్లే తర్వాత మూడో స్థానానికి రవిచంద్రన్ అశ్విన్ చేరుకున్నాడు ' అని వివరించాడు. ఈ క్రమంలోనే అశ్విన్ కచ్చితంగా లెజెండ్ అని స్పష్టం చేశాడు.