
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనుకున్నది సాధించాడు. టెస్టు ఫార్మాట్లో నెంబర్ వన్ బౌలర్ ర్యాంకు తన సొంతం చేసుకున్నాడు. కొన్నిరోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ అగ్రస్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండో స్థానంలో నిలవగా.. అశ్విన్ మూడో ర్యాంకులో ఉన్నాడు. అయితే వీళ్ల ముగ్గురి రేటింగ్ పాయింట్ల మధ్య తేడా అంత ఎక్కువ లేదు. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్న అశ్విన్.. ర్యాంకింగ్స్ మెట్లు ఎక్కడం ఖాయంగా కనిపించింది కూడా.
తన తల్లికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ప్యాట్ కమిన్స్.. భారత్‌తో టెస్టు సిరీసు నుంచి అర్ధంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. మూడో టెస్టులో ఆడకుండా స్వదేశం వెళ్లిపోయాడీ కంగారూ కెప్టెన్. దీంతో అతని స్థానంలో స్టార్ క్రికెటర్ స్టీవెన్ స్మిత్ ఆ జట్టు సారధ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇండోర్ వేదికగా జరిగిన భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ బరిలో దిగాడు. బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోని అతను.. బౌలింగ్‌లో కూడా వికెట్ తీసుకునే అవకాశం రాలేదు. అయితే తొలి రెండు టెస్టుల్లో అశ్విన్ అద్భుతంగా రాణించాడు. నాగ్‌పూర్ టెస్టులో మంచి ప్రదర్శన చేసిన అతను.. ఢిల్లీలో కూడా ఆసీస్‌ను బెంబేలెత్తించాడు.
ఇప్పటి వరకు ఈ సిరీసులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జడేజా తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ స్థానం మెరుగైంది. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో అశ్విన్ అగ్రస్థానం సంపాదించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెద్దగా ఆకట్టుకోని ప్యాట్ కమిన్స్ మూడో స్థానానికి పడిపోక తప్పలేదు. న్యూజిల్యాండ్‌పై రాణించి, అగ్రస్థానం సాధించిన జేమ్స్ ఆండర్సన్ రెండో స్థానానికి పడిపోయాడు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా అశ్విన్ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో మరో భారత స్టార్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.