
ఆస్ట్రేలియా, భారత్ మధ్య టెస్టు మ్యాచ్ అంటే ఎలా ఉండాలి? బంతులు, బ్యాట్లే కాదు.. మాటలు కూడా పేలాలి కదా. కానీ నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో అలాంటివి పెద్దగా కనిపించలేదు. దీంతో మ్యాచ్ అంతా చప్పగా సాగుతుందని అనిపించింది. కానీ మధ్యలో సిరాజ్, స్టీవ్ స్మిత్ మధ్య కొంచెం అగ్గి రగిలింది. అయితే స్మిత్ వికెట్ తీసే అవకాశం మాత్రం సిరాజ్‌కు దక్కలేదు.
వీళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగిన కాసేపటికి అశ్విన్, మార్నస్ లబుషేన్ మధ్య కూడా కొంత కామెడీ జరిగింది. అశ్విన్ వేసిన బంతిని లబుషేన్ మిస్ చేశాడు. దాన్ని కీపర్ భరత్ అందుకున్నాడు. అది చూసిన అశ్విన్.. బంతి స్పిన్, బౌన్స్ అవుతోందంటూ లబుషేన్‌కు చిన్న వార్నింగ్ ఇచ్చాడు. ముందు అది చూసిన వాళ్లకు అశ్విన్ ఈ విషయం కీపర్‌కు చెప్తున్నట్లు అనిపించింది. కానీ వాళ్లిద్దరి మధ్యలో ఉన్న లబుషేన్ దానికి రియాక్ట్ అయ్యాడు. ఇది చూసిన అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.
ఆస్ట్రేలియా జట్టు ఆటలో స్లెడ్జింగ్‌కు పెట్టింది పేరు. ప్రత్యర్థి ఆటగాళ్లపై మాటల తూటాలు పేలుస్తూ ఇబ్బంది పెట్టడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి ఆ జట్టును స్లెడ్జింగ్‌లో ఇబ్బంది పెట్టిన జట్టు భారత్ ఒక్కటే అని చెప్పాలి. కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాలో పర్యటించిన జట్టు.. ఆసీస్ ఆటగాళ్లకు దీటుగా మాటల తూటాలు పేల్చింది. అలాంటి జోరే ఈసారి కూడా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
కాగా, లబుషేన్‌తో ఇలా చిన్న సీన్ తర్వాత అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత వేగంగా 450 టెస్టు వికెట్లు తీసుకున్న భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంతకాలం అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అశ్విన్ కన్నా వేగంగా లంక లెజెండ్ ముత్తయ్య మురళీ ధరన్ మాత్రమే 450 టెస్టు వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ ఈ ఫీట్ సాధించడానికి 89 టెస్టులు ఆడగా.. మురళీధరన్ కేవలం 80 టెస్టుల్లోనే 450 వికెట్లు తీసుకున్నాడు.